హుజూరాబాద్, మే 27: కరెంటు వాడకంపై అవగాహన లేకపోవడం.. అనవసరంగా వినియోగించడం.. చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల బిల్లులు అధికంగా రావడంతో పాటు విద్యుత్ వృథా అవుతోంది. దీనిని అరికట్టేందుకు విద్యుత్ శాఖ చక్కటి పరిష్కారాన్ని చూపుతున్నది. పవర్ సేవింగ్ అనేది వినియోగదారుల చేతుల్లోనే ఉందని, అవగాహన ఉంటే పొదుపు సాధ్యమేనని చెబుతున్నది. ఇంట్లో టీవీ, ఫ్యాన్, ఏసీ, ఫ్రిజ్, గీజర్, ఓవెన్, తదితర పరికరాలు ఉన్నప్పుడు అధిక బిల్లు సహజమని.. అయితే వాడకంలో కొన్ని టెక్నిక్స్ పాటిస్తే భారం నుంచి బయటపడవచ్చని వివరిస్తున్నది. అవేంటో చూడాలంటే మధ్యపేజీకి వెళ్లండి..
ఒకప్పుడు ఇంట్లో విద్యుత్ వాడకం చాలా తక్కువగా ఉండేది. పొద్దంతా కరెంట్ ఉందో.. లేదో కూడా పెద్దగా పట్టించుకునే అవసరమే ఉండేది కాదు. వాడకం అంతంత మాత్రంగానే ఉండడంతో బిల్లు కూడా తక్కువగానే వచ్చేది. బిల్లు గురించి అస్సలు టెన్షనే ఉండేది కాదు. కానీ ప్రస్తుతం కరెంట్ వినియోగం పెరిగిపోయింది. ఇక ఎండకాలంలో అయితే వాడకం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. అంతలా డిమాండ్ ఏర్పడింది. ఐదుపది నిమిషాలు కరెంట్ పోతేనే ప్రజలు నానా హైరానా పడుతున్నారు. ఒకప్పుడు కూలర్ ఉంటే విలాసవంతమైన కుటుంబంగా పరిగణించేవారు. ఇప్పుడు కూలర్ సంగతి దేవుడెరుగు చాలా ఇండ్లలో ఏసీలే పెట్టేస్తున్నారు. ఫలితంగా రీడింగ్ మీటర్ జెట్స్పీడ్ కన్నా వేగంగా తిరుగుంతుండగా, నెలాఖరుకు బిల్ చూస్తే వినియోగదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో పవర్ సేవింగ్ ఎలా చేయాలి.. బిల్లును 25శాతం మేర ఎలా తగ్గించుకోవాలి..? అనే సందేహాలకు విద్యుత్ శాఖ చక్కటి పరిష్కారాలను చూపుతున్నది.
అవగాహన అవసరం..
కరెంటు వినియోగంపై అవగాహన పెంచుకొని పొదుపు పాటిస్తే బిల్లు అదుపులో ఉంటుంది. ఎలక్ట్రిక్ పరికరాలు వినియోగిస్తునప్పుడు వాటి సామర్థ్యంపై అవగాహన ఉండాలి. ఏసీ, మోటరు, గీజర్, ఫ్రిజ్ ఏకకాలంలో వాడితే వినియోగం పెరిగి ఆర్ఎండీ (రికార్డెడ్ మాగ్జిమం డిమాండ్ పెరగడంతో అదనంగా లోడ్ నమోదై ప్రతి కిలోవాటుకు అదనపు చార్జీలు పడే అవకాశం ఉంది. ఇలా అదనపు చార్జీలు పడకుండా ఉండాలంటే వినియోగంపై అవగాహన తప్పనిసరి. ఒకేసారి అన్ని విద్యుత్ పరికరాలు వాడొద్దు. రెండు లేదా అంతకంటే ఎకువ ఏసీలు ఉన్నప్పుడు 30 నిమిషాలకు మించకుండా చూడాలి. అలా వాడితే ఆర్ఎండీ నియంత్రణలో ఉంటుంది. అదనపు చార్జీలు పడవు.- సంపత్ రెడ్డి, ఏఈ, హుజూరాబాద్
ఏసీ వాడకం వల్ల కరెంటు బిల్లు రూ.వేలల్లో వస్తుంది. ఒక 1.5 టన్నుల సామర్థ్యం ఉన్న ఏసీ వినియోగిస్తే గంటకు 2యూనిట్లు కరెంటు కాలుతుంది. గదిలో కిటికీలు, తలుపులు మూసి వేసి ఏసీ స్విచ్ వేసి 15 నిమిషాల పాటు ఫ్యాన్ కూడా వేయడం వల్ల గది ఉష్ణోగ్రత వేగంగా చల్లబడుతుంది. తర్వాత ఫ్యాన్ బంద్ చేయాలి. ఏసీలు వినియోగిస్తున్నప్పుడు 25 డిగ్రీల ఉష్ణోగ్రతలో వినియోగించాలి. కొందరు అవగాహన లేక 15 లేదా 17 డిగ్రీల ఉష్ణోగ్రతతో వాడడం వల్ల కరెంటు అధికంగా కాలుతుంది. ఏసీ ఫిల్టర్లు శుభ్రంగా ఉంచడం, బయట ఉండే కంప్రెషర్ నీడ ఉండే చోట ఉంచాలి. ఏళ్ల తరబడి ఉన్న పాత ఏసీలు, రిఫ్రిజిరేటర్లు వినియోగించకపోవడం మంచిది.
ఈ టెక్నిక్స్ పాటిస్తే మేలు
ఇంట్లో గదుల్లో ఫిలమెంట్ బల్బు వాడితే 60 వాట్లు, ఫ్లోరోసెంటు ల్యాంపులు (సీఎస్ఎల్) వాడితే 40 వాట్లు కరెంటు కాలుతుంది. వాటికి బదులు ఎల్ఈడీ బల్బులు వాడితే కేవలం 9 వాట్లు మాత్రమే కరెంటు కాలుతుంది. బిల్ తక్కువ వస్తుంది.
వాషింగ్ మెషిన్లు వినియోగిస్తున్నప్పుడు దుస్తులు ఉతకడంతో పాటు అరబెట్టే యంత్రాలున్నాయి. ఆరబెట్టే ఆప్షన్ కాకుండా శుభ్రపరిచిన వెంటనే ఆరుబయట బట్టలు ఆరవేసుకుంట బట్టలు యంత్రం వినియోగించే సమయం తగ్గుతుంది. తద్వారా కరెంటు వినియోగం తగ్గుతుంది. వాషింగ్ మెషిన్ పని అయిపోయిన వెంటనే స్విచ్ఛాఫ్ చేయడం మరిచిపోవద్దు.
ఒక నెలలో దేనికెంత విద్యుత్తు..