పెద్దపల్లి రూరల్, మే 27;ఎండకాలం కూరగాయల సాగు సిరులు కురిపిస్తున్నది.. ఉద్యానవనశాఖ అధికారుల ప్రోత్సాహంతో రైతాంగం మూడో పంట వేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నది. తీరొక్క కూరగాయల రకాలు వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తుండడంతో ఆనందంలో మునిగితేలుతున్నది.
జిల్లా రైతులు సాధారణంగా యేటా రెండు పంటలు పండిస్తుంటారు. ముఖ్యంగా వానకాలం పంట చేతికివచ్చిన తర్వాత రెండు, మూడు నెలలపాటు చేన్లన్నీ బీడుగా ఉంటాయి..అయితే, ఈ సమయంలో మూడో పంటగా కూరగాయలు వేస్తే అదనపు లాభాలు ఆర్జించే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఉద్యానవ శాఖ అధికారులు ఎండకాలంలో కూరగాయలు సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ఎండవేడిమిని తట్టుకొనే రకాలను వేస్తే సత్ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా బెండ, బీర, కాకర, కాకర, సోరకాయ, టమాటో, వంకాయ, గోరుచిక్కుడు, ఆకుకూరల్లో తోటకూర, మెంతి, గోంగూర, చుక్కకూర, పూదీన, కొత్తిమీర లాంటి పంటలు అనుకూలమని పేర్కొంటున్నారు.
సాగు విధానం ఇలా..
కూరగాయల సాగుకు ముందు చేనును మూడు నాలుగుసార్లు కలియ దున్నాలి. దుక్కిని మెత్తగా తయారు చేసుకొని నాణ్యమైన విత్తనాలు, నారునుగాని ఎంపిక చేసుకొని నాటాలి. చేనులో సారం కోసం పశువుల ఎరువును ఎకరానికి 10 నుంచి 15 టన్నుల వరకు చల్లుకోవాలి. వంకాయ, బెండ ,టమాటోలాంటి పంటలకు బోజేలు చేసి నారును నాటాలి. పంటలకు డ్రిప్ పద్ధ్దతిలో నీరందించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. తీగ జాతి కి బీర, సొర, కాకరకాయల తోటను పందిరి విధానంలో సాగు చేయాలి. ఆకు కూరలను మాత్రం చిన్న చిన్న మడులుగా చేసుకుని విత్తనాలు చల్లుకోవాలి. వేసవిని దృష్టిలో ఉంచుకుని టమాటో, వంకాయ తోటలను 45 X 45, 45 X 30 దూరంలో బెండను 45 X 20 దూరంలో నాటుకోవాలి.
సస్యరక్షణ చర్యలు
కూరగాయల పంటలకు సాధారణంగా ఎకరానికి 32 నుంచి 48కిలోల నత్రజని, 24 నుంచి 32 కిలోల భాస్వరం లేదా పొటాష్‌తో కూడిన ఎరువులను వేయాలి. కాయ ఎదుగుదల కోసం పొటాషియం నైట్రేట్(13-0-45) లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి రెండు సార్లు పిచికారీ చేస్తే కాయ ఎదుగుదలకు వస్తుంది. నీటి కొరతతో టమాటలో కాల్షియం లోపం ఏర్పడి వచ్చే కుళ్లు నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల కాల్షియం నైట్రేట్ కలిపి స్ప్రే చేయాలి. టమాట, వంకాయ, బెండ, తీగ జాతి కూరగాయ లతోపాటు ఆకు కూరల్లో రసం పీల్చే పురుగుల నివారణకు తెగుళ్లు సోకిన మొక్కలను పీకి వేసి అంతం చేయాలి. ఎకరం పొలంలో 10 పసుపు రంగు డబ్బాలు గాని, జిగురు అట్టలను గాని పూసి అక్కడక్కడ పెట్టాలి. తామర పురుగులకు నీలం రంగు అట్టలను వాడాలి. పిప్రోనిల్ 2 ఎంఎల్‌ను ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఎండ ప్రభావాన్ని తగ్గించండి ఇలా..
కూరగాయలు, ఆకు కూరలు సాగు చేసిన పంటపొలాలు, చేన్లలో నీడనిచ్చే విధంగా జొన్న, మక్కజొన్నను ప్రతి నాలుగు వరుసలకు ఒక వరుస చొప్పున నాటుకోవాలి. టమాటో దోస, పుచ్చకాయ వంటి తోటలకు నీటి యాజమాన్య హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవాలి. లేదంటే కాయలు పండు దశకు వచ్చి పగుళ్లు బారుతాయి. నివారణకు బోరాక్స్ 3 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి వారంలో రెండు సార్లు పూత పిందే దశల్లోనే పిచికారీ చేయాలి. తీగ జాతి కూరగాయల్లో ఆడ పూల శాతం పెంచేందుకు 2 నించి 4 ఆకులు వేసే దశలోనే బోరాక్స్ 3 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి వారంలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఎండ వేడికి యూరియాశాతం ఆవిరి కాకుండా మొక్కకు ఎక్కువ రోజులు అందుబాటులో ఉండేలా వేపనూనె కలిపిన యూరియాను వాడుకోవాలి. పూత పిందె రాలకుండా ప్లానోఫిక్స్(ఎన్ఎఎ)2.5 మి.లీలను 10 లీటర్ల నీటిలో కలిపి పూత దశలో ఉండగా వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి.
అన్ని రకాలు వేసుకోవచ్చు..
రైతులు ఎండకాలంలో అన్ని రకాల కూరగాయలు, ఆకు కూరలు సాగు చేసుకోవచ్చు. వేడిమికి చీడపీడలు ఎక్కువగా వస్తాయనే ఉద్దేశంతో రైతులు కూరగాయలు వేయడం లేదు. యాసంగి పంటలు, వానాకాలం పంటలకు మధ్య కాలంలో మరోక పంట తీసుకునే అవకాశం ఉన్నది. అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలకు సంబంధించిన పంటలు వేసుకుని తక్కువ కాలంలో సేంద్రియ ఎరువులతో ఎక్కువ లాభాలతో కూడిన పంటలు పండించి ఆర్థికంగా ఎదుగవచ్చు.
– ఏ జ్యోతి, ఉద్యానవనశాఖ అధికారి, పెద్దపల్లి