కరీంనగర్, మే 27 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్‌ను మరో భైంసా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. మైనార్టీ, మెజార్టీ పేరుతో ప్రజల్ని చీల్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నదే బీజేపీ వ్యూహంగా కనిపిస్తున్నది. ఏ మైనార్టీ వర్గాల వారైనా దేశంలో పుట్టిన వాళ్లే. వాళ్లదీ మన రక్తమే. మతం అనేది వ్యక్తిగతం. దీనిని బజారులో పెట్టద్దు. ముస్లింలు, ఇతర మైనార్టీ వర్గాలెవరైనాగాని మోదీ, బండి ట్రాప్‌లో పడద్దు.కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ మూడేళ్లలో మూడు రూపాయల పని కూడా చేయలేదు. నేను ఎంపీగా ఉన్నప్పుడు ప్రతిపాదించిన జాతీయ రహదారులు, రైల్వే పనులు ఏ స్థాయిలో ఉన్నాయనే విషయం కూడా ఆయనకు తెలియదు. ఇప్పటికీ నేనే ఆ పనుల గురించి ఫాలోఅప్ చేస్తున్నా.
అభివృద్ధి చేసేందుకు చేతగాని బీజేపీ నాయకులు దేశంలో మత చిచ్చు పెట్టాలని చూస్తున్నారని, కరీంనగర్‌ను మరో భైంసాగా మార్చాలని చూస్తున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మండిపడ్డారు. శుక్రవారం కరీంనగర్‌లోని ప్రతిమా మల్టీప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చరిత్రలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా హిందూ మతం నుంచి ఇతర మతాలను స్వీకరించారని తెలిపారు.
ప్రపంచంలోని అనేక దేశాల్లో హిందువులు ఉన్నారని, అక్కడ పెద్ద పెద్ద దేవాలయాలను నిర్మించుకుంటున్నారని, అమెరికా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో వందలాది హిందూ దేవాలయాలు ఉన్నాయని, ఇక్కడ మత విద్వేషాలను రెచ్చగొడితే ఆయా దేశాల్లో మైనార్టీలుగా ఉన్న హిందువుల పరిస్థితిని బీజేపీ నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. హిందూ అనేది మతం కాదని, అది ఒక మార్గమని, అలాంటి మార్గంలో మనందరం నడవాలని సూచించారు. హిందూ పేరుతో మతాన్ని రెచ్చగొట్టడం, వేరే మతాల గురించి అనుచితంగా మాట్లాడటం మంచిది కాదని హితవుపలికారు. యాత్రలు చేసినా, సభలు నిర్వహించినా, ఎవరి మతం గురించి వారు గొప్పగా చెప్పుకోవాలే తప్ప ఇతర మతాలను కించ పర్చకూడదని, ఇదే పని చేస్తున్న బీజేపీ వైఖరిని టీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నదని స్పష్టం చేశారు.
ఐటీ కంపెనీలను తెప్పించే బాధ్యత లేదా?
ఐటీ కంపెనీల ఏర్పాటు కోసం కరీంనగర్లో ఐదు అంతస్తుల భవనం నిర్మించామని, కొన్ని కంపెనీలు వచ్చాయని, అమెరికా వెళ్లి అక్కడి ప్రముఖ కంపెనీలతో మాట్లాడి తెప్పించే బాధ్యత బండి సంజయ్‌కి లేదా? అని వినోద్‌కుమార్ ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే ట్రిబుల్ ఐటీని తేవాలని, అభివృద్ధిలో కలిసిరావాలని హితువు పలికారు. తాను ఎంపీగా ఉన్నప్పుడే కరీంనగర్‌ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్పించానని, రూ.వెయ్యి కోట్లతో ఇప్పుడు కరీంనగర్ అభివృద్ధి చెందుతోందన్నారు. ఇలాంటి పథకాలు ఏవైనా ఉంటే తేవాలే గానీ ఈ విధంగా మతాలను రెచ్చగొట్టి, మైనార్టీలపైకి ఉసిగొల్పాలని చూడటం అవివేకమే అవుతుందన్నారు. మతాన్ని రాజకీయం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ దేశాలన్నీ ముందుకు వెళ్తుంటే మత మౌఢ్యంలో చిక్కుకున్న మన దేశం వెనుకబడి పోతున్నదన్నారు.
అందరికంటే గొప్ప హిందువు సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ అందరి కంటే గొప్ప హిందువు అని, ప్రభుత్వ ధనంతో యాదాద్రిని పునర్నిర్మించిన ధైర్యవంతుడని వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. వేములవాడ పుణ్యక్షేత్రాన్ని కూడా 32 ఎకరాల్లో దక్షిణ కాశీగా తీర్చిదిద్దబోతున్నామని స్పష్టం చేశారు. టీటీడీ సహకారంతో కరీంనగర్లో అద్భుతమైన శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని నిర్మించుకోబోతున్నామని తెలిపారు. ఇటీవల రాజ్యసభకు నామినేషన్ వేసిన దివికొండ దామోదర్ రావు, మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్లో స్థల పరిశీలిన కూడా జరిగిందని చెప్పారు. మతంపై ప్రేమ ఉంటే ఈ విధంగా వెల్లడించుకోవాలి తప్ప దానిని బహిర్గతం చేయడం మూర్ఖత్వమని హితవుపలికారు.
బ్రిటీషర్లకు బీజేపీకి తేడా లేదు
స్వాత్రంత్య్రం రాకముందు బ్రిటీషర్లు దేశ ప్రజలను ప్రాంతాల వారీగా విభజించి అధికారం చెలాయించారని, ఇప్పుడు మెజార్టీ, మైనార్టీ పేరుతో ప్రజలను విభజించి బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోందని, వాళ్లకూ వీళ్లకు తేడా లేదని వినోద్‌కుమార్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతూ మతాలను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై రాజ్యాంగ బద్దమైన ప్రధాని పదవిలో ఉన్న నరేంద్ర మోదీ తన బాధ్యతలను మర్చి మాట్లాడుతున్నారని విమర్శించారు.
తెలంగాణపై ఆది నుంచీ విషం
ప్రజాస్వామ్యబద్దంగా, పార్లమెంటరీ విధానంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంపై మోదీ ఆది నుంచీ విషం చిమ్ముతూనే ఉన్నారని మండిపడ్డారు. 2004లో టీఆర్ఎస్ నుంచి ఐదుగురు ఎంపీలు ఉన్నప్పుడే 32 రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టిన విషయాన్ని గుర్తు చేశారు. 1998లో ఒక ఓటు రెండు రాష్ర్టాల నినాదంతో ఎన్నికల్లోకి వచ్చిన బీజేపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని, ఆనాడు చంద్రబాబునాయుడు రాజకీయంగా ఒత్తిడి తేవడంతో ప్రధాన డిమాండ్‌గా ఉన్న తెలంగాణకు అన్యాయం చేశారని, ఎలాంటి డిమాండ్ లేని మూడు రాష్ర్టాలను ఏర్పాటు చేసిన విషయాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం జరిగినపుడు గుజరాత్‌కు సీఎంగా ఉన్న మోదీకి ఇక్కడ జరిగినవి ఏం తెలుసని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో మోదీ పార్లమెంట్లో తన ప్రసంగంలో తల్లిని చంపి, బిడ్డను బతికించారని ఏపీ విభజనపై వ్యాఖ్యలను గుర్తు చేశారు. మొదటి పార్లమెంట్ సమావేశాల్లోనే ఆంధ్రాకు అనుకూలంగా వ్యవహరించారని, ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను, 500 మెగావాట్ల సీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆంధ్రాకు కట్టబెట్టారని, ఈ సమయంలో పార్లమెంట్లో తామెంత మొత్తుకున్నా వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మోదీ ఇప్పుడు తెలంగాణను అభివృద్ధి చేస్తానని చెప్పడం సిగ్గు చేటుగా ఉందన్నారు. టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని విమర్శించే ముందు తన పార్టీలో ఎంత మంది వారసత్వంగా రాజకీయాల్లో వచ్చి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచారో చూసుకోవాలని హితవుపలికారు.
ఐఎస్బీ విద్యార్థులకు విషం నూరిపోసే ప్రయత్నం
హైదరాబాద్‌లోని ఐఎస్బీ విద్యార్థులకు ప్రధాని మోదీ విషం నూరి పోసే ప్రయత్నం చేశారని, స్వచ్ఛ భారత్ గురించి చెప్పినప్పుడు అవార్డులకు ఎంపికైన రాష్ట్రంలోని 19 గ్రామాల గురించి ఎందుకు చెప్పలేదని, తెలంగాణ వినియోగించుకుంటున్న పవర్ క్వాలిటీ కంజెమ్షన్ గురించి ఎందుకు ప్రస్తావించ లేదని నిలదీశారు. తెలంగాణలోని విద్యా విధానం, రోడ్లు, ఇతర అభివృద్ధి గురించి ఎందుకు వివరించలేదని ప్రశ్నించారు. 2014 నుంచి ఇప్పటి వరకు దేశంలో చెప్పుకోదగిన పథకం ఒక్కటి కూడా అందించని మోదీ అనేక విషయాల్లో విఫలమయ్యారని, పెద్ద నోట్ల రద్దు ఇందుకు నిదర్శనమన్నారు.
జనధన్ పథకం వల్ల ఎవరికి లాభం జరిగిందని ప్రశ్నించారు. తెలంగాణలో కోటి మందికి ఖాతాలు తెరుస్తామని చెప్పి 36 లక్షల ఖాతాల వరకే నిలిపి వేశారని, ఇప్పుడు ఆ ఖాతాలు కూడా పనికి రాకుండా పోయాయని అన్నారు. వంద దేశాలకు బియ్యం సరఫరా చేస్తామని చెబుతున్న మోదీకి ఏ గోడౌన్లో ఎన్ని నిలువలు ఉన్నాయో తెలుసా? అని ప్రశ్నించారు. అసలు మోదీకి ఒక్క విషయం మీద కూడా అవగాహన లేదన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత దేశంలో 70 కోట్ల మంది 25 ఏండ్ల వయసు వాళ్లే ఉన్నారని, వీళ్ల భవిష్యత్తు కోసం ఆలోచించకుండా మత విద్వేషాలు, కుల వైషమ్యాలను పెంచేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
ప్రజలను చీల్చవద్దు
హిందూ ఏక్తా యాత్రలో ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వినోద్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఆయన ట్రాప్‌లో మైనార్టీలు పడవద్దని విజ్ఞప్తి చేశారు. మెజార్టీ, మైనార్టీ పేరుతో ప్రజలను చీల్చి తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్నారని, ఇది సాధ్యమయ్యే పని కాదని హితవుపలికారు. సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కరీంనగర్ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, హుజూరాబాద్ టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్, నాయకులు చల్ల హరిశంకర్, కొదురుపాక మల్లికార్జున్, పొన్నం అనిల్‌కుమార్, జక్కుల నాగరాజు, కార్పొరేటర్లు రమణారావు, కంసాల శ్రీనివాస్, డీ మహేశ్ పాల్గొన్నారు.