రాజన్న సిరిసిల్ల, మే 27 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాలకు వరద సిరిసిల్ల పట్టణంలోకి చేరకుండా రాష్ట్ర సర్కారు చర్యలు వేగవంతం చేసింది. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. యుద్ధప్రాతిపదికన కచ్చా కాలువ నిర్మాణ పనులను చేపట్టింది. తాత్కాలిక ప్రాతిపదికన 8 మీటర్ల వెడల్పు, 2.50 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న వరదకాలువ కవచంలా మారనుండగా శాంతినగర్ వాసులకు ముంపు భయం తీరనుంది. పనులు చకచకా సాగుతుండడంతో ఈ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సిరిసిల్ల పట్టణంలోకి లోతట్టు ప్రాంతాల్లో వరదకు అడ్డుకట్ట వేసేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆదేశాలతో అధికార యంతాంగం రంగంలోకి దిగింది. యుద్ధప్రాతిపదికన కాలువ పనులు ప్రారంభించింది. కొత్త చెరువు నుంచి కాళేశ్వరం 9వ ప్యాకేజీ కెనాల్ వరకు కచ్చాకాలువ నిర్మిస్తున్నది.
గతేడాది సిరిసిల్లను ముంచెత్తిన వరద
గతేడాది కురిసిన భారీ వర్షాలతో సిరిసిల్ల జిల్లా కేంద్రాన్ని వరద ముంచెత్తింది. సుందరయ్య నగర్, ప్రగతినగర్, శివనగర్, వెంకంపేట, అశోక్‌నగర్, సంజీవయ్యనగర్, వాసవీనగర్, శాంతినగర్ ప్రాంతాలన్నీ జలసంద్రమయ్యాయి. ఇళ్లలోకి చేరిన నీటిలో చిక్కుకున్న ప్రజల్ని రక్షించేందుకు మంత్రి కేటీఆర్ హైదారాబాద్ నుంచి హుటాహుటిన డీఆర్ఎఫ్, టూరిజం బృందాలను సిరిసిల్లకు పంపించారు. పోలీసు, రెవెన్యూ శాఖలు కలిసి వరదనీటిలో చిక్కుకున్న 219 మందిని రక్షించి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. వరద నీటిలో ముంపునకు గురైన ప్రాంతాలను మంత్రి కేటీఆర్ స్వయంగా సందర్శించి, ప్రజలకు నేనున్నాంటూ భరోసా ఇచ్చారు. వరద నీరు చేరకుండా కాలువలు నిర్మించాలని అప్పటి కప్పుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు కురిసినా వరదలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కబ్జాకు గురైన కాలువపై అధికారుల చర్యలు
పెద్ద బోనాల నుంచి పద్మనగర్ వరకు నిర్మించిన వరద కాలువ కబ్జాకు గురైంది. ఈ విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అందుకు స్పందించిన మంత్రి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కాలువను కబ్జా చేసి నిర్మించుకున్న ఇండ్లను మున్సిపల్ అధికారులు కూల్చి వేశారు. బోనాల నుంచి పద్మనగర్ వరకు కబ్జాకు గురైన కాలువ నిర్మాణ పనులు తిరిగి చేపట్టారు. వెంకంపేట నుంచి పాత బస్టాండ్, శాంతినగర్‌కు వరద నీరు చేరకుండా కొత్తచెరువులోకి మళ్లించేందుకు చర్యలు తీసుకున్నారు. చెరువు నిండిన తర్వాత నీరు శాంతినగర్‌లోకి రాకుండా ఉండేందుకు మరో కాలువ నిర్మాణానికి మున్సిపల్ అధికారులు రూ. 32 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఆ పనులు ప్రారంభించక ముందే ఆకాల వర్షాలు కురువడం ముంపు ప్రాంతాల ప్రజల్లో ఆందోళన కలిగించింది. చిన్న పాటి వర్షానికే నీరు రోడ్లపైన చేరి ఇండ్లలోకి ప్రవేశించాయి. ఆప్రాంత ప్రజలు తిరిగి మంత్రి దృష్టికి తీసుకెళ్లగా స్పంధించిన ఆమాత్యుడు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరద నీటి ప్రమాదం లేకుండా ఉండేందుకు అధికార యంత్రాగం యుద్ధ ప్రాతిపదికన తాత్కాలికంగా కచ్చా కాలువ నిర్మాణ పనులను ప్రారంభించింది. సుమారు రూ. 20 లక్షలతో కొత్తచెరువు నుంచి బైపాస్‌రోడ్డులోని కాళేశ్వరం ప్రాజెక్టు 9 ప్యాకేజీ కెనాల్లోకి నీరు చేరేలా కచ్చా కాలువ నిర్మాణ పనులు ప్రారంభించింది. 8మీటర్ల వెడల్పు, 2.50కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న కాలువ నిర్మాణం వల్ల వరద నీరు లోతట్టు ప్రాంతాలకు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. నాలుగు నెలల్లో మరో చోట నుంచి శాశ్వత కాలువ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. కాలువ నిర్మాణంతో వరద ఇబ్బందులు తీరనున్నందున ముంపు ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
యుద్ధప్రాతిపదికన పనులు
అకాల వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు కచ్చా కాలువ నిర్మాణం చేపట్టాం. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు వర్షాకాలం పూర్తయిన తర్వాత మరో ప్రాంతం నుంచి శాశ్వత కాలువ నిర్మాణానికి ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తాత్కాలిక కాలువ ద్వారా ఎవరికీ ఇబ్బంది ఉండదు. ముంపునకు గురవుతున్న శాంతినగర్ ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు కాలువ నిర్మాణంలో సహకరించిన శ్రీనగర్ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు. నాలుగు నెలల తర్వాత శాశ్వత కాలువ నిర్మాణ పనులు ప్రారంభిస్తాం.
– జిందం కళ, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్