విద్యానగర్, మే 27: ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలను పెంచాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన వైద్యాధికారులు, అంగన్వాడీ సూపర్వైజర్లతో జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో గర్భిణుల వివరాల నమోదు, సాధారణ ప్రసవాల సంఖ్య పెంపుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గర్భిణులకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. వైద్య, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో పని చేసి గర్భిణులు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. వలస కార్మికులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.
అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, ఆశ కార్యకర్తలు గర్భిణుల ఆరోగ్య వివరాలు తెలుసుకోవడంతో పాటు పోషకాహారం తీసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కరోనా సమయంలో వైద్య, అంగన్వాడీ సిబ్బంది, ఆశ కార్యకర్తలు అందించిన సేవలు అభినందనీయమని కొనియాడారు. పీహెచ్సీల్లో ప్రసవాలు చేయించుకున్న వారికి ఇచ్చే కేసీఆర్ కిట్, ఇతర ప్రోత్సాహకాలపై గర్భిణులకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో మొదటి సారిగా జిల్లాలో అనీమియా ముక్త్ కరీంనగర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఈ కార్యక్రమం ద్వారా రక్తహీనతతో బాధపడుతున్న మహిళలను గుర్తించి వైద్య సేవలందించనున్నట్లు పేర్కొన్నారు.
ఇందుకోసం ప్రత్యేకంగా ‘ఏ షీల్డ్ యాప్’ను రూపొందించినట్లు తెలిపారు. దీనిపై ఏఎన్ఎంలకు, ఆశ కార్యకర్తలకు శిక్షణ ఇస్తామని పేరొన్నారు. పీహెచ్సీల వారీగా గర్భిణుల వివరాలు సేకరించి ప్రసవం చేసుకునేలా అవగాహన కల్పించాలని, ఓపీల వివరాలు నమోదు చేయాలని, ల్యాబ్ టెక్నీషియన్లు అందుబాటులో లేకుంటే ఆశ కార్యకర్తలను వినియోగించుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ, పీహెచ్సీల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆదేశించారు. అవసరమైతే వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి వైద్య సేవలందించాలని సూచించారు.
పోషన్ అభియాన్, తల్లి పాల విశిష్టతపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, వైద్యుడు అలీం, వైద్యాధికారులు, ఐసీడీఎస్ సీడీపీవోలు, అంగన్వాడీ సూపర్వైజర్లు పాల్గొన్నారు.