మానకొండూర్ రూరల్, మే 27: ‘అప్పు చేసి తప్పు చేశా..పెండ్లి చేసుకొని ఇంకా పెద్ద తప్పు చేసిన..అనన్య (భార్య) నన్ను క్షమించు..తమ్ముడు అమ్మానాన్నలను బాగా చూసుకో.. వచ్చే జన్మలో నీకు తమ్ముడిగా పుడతరా..’ అంటూ ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు..వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ప్రాణాలు విడిచాడు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం అన్నారంలో బుధవారం ఈ విషాద ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అన్నారం గ్రామానికి చెందిన మార్క ప్రశాంత్(26) మూడేండ్ల కిందట అదే గ్రామానికి చెందిన ముద్రకోల రామాంజనేయులు వద్ద 10 శాతానికి రూ.3లక్షలు అప్పుగా తీసుకున్నాడు.
ఇది అంతకంతకు పెరిగిపోయి రూ. 20లక్షలకు చేరింది. ఇతరుల దగ్గర అప్పులు తెచ్చి రూ. 10 లక్షల దాకా చెల్లించాడు. మిగిలిన మొత్తం కట్టాలని వడ్దీ వ్యాపారి ఒత్తిడి తేవడంతో దిక్కుతోచని స్థితిలో అప్పుతీర్చే దారిలేక శుక్రవారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు చేరుకొని మృతుడి జేబులోని సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ కృష్ణారెడ్డి తెలిపారు. కాగా, అయిదు నెలల గర్భిణి అయిన అనన్య రోదించిన తీరు పలువురిని కంటతడిపెట్టించింది. మృతుడికి తల్లి పద్మ, త్రండి అంజయ్య, సోదరుడు అజయ్ ఉన్నారు.
గ్రామంలో ఉద్రిక్తత..
పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కరీంనగర్ దవాఖానకు తరలించారు. పోస్ట్‌మార్టం పూర్తికాగానే మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే అంత్యక్రియలు చేసేందుకు నిరాకరించారు. యువకుడి ఆత్మహత్యకు కారణమైన వడ్డీవ్యాపారీ వచ్చేదాకా కర్మకాండలు చేయబోమని భీష్మించారు. పెద్దసంఖ్యలో బంధువులు చేరుకొని ఆందోళనకు దిగడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్నది. అయితే పోలీసులు బంధువులతో చర్చించి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం అంత్యక్రియలు చేశారు.