తెలంగాణచౌక్, మే 27: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం చేర్చడమే లక్ష్యంగా ఆర్టీసీ ముందుకు సాగుతున్నది. ప్రయాణికుల ఆదరణ పొందేందుకు పలు రకాల ఆఫర్లు, ప్రత్యేక దినోత్సవాల సందర్భంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నది. వివాహ వేడుకలు, విహార యాత్రలకు రాయితీపై అద్దె ప్రాతిపదికన బస్సులు నడుపుతున్నది. 30 మంది ప్రయాణికులు ఉన్న చోటుకే బస్సులను పంపిస్తున్నారు. ప్రైవేట్ వాహనాల కంటే అద్దె తక్కువగా ఉండడం, అనుభవజ్ఞులైన డ్రైవర్లు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంతో ప్రజలు కూడా ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకుంటున్నారు.
అంతేకాకుండా 30 రోజులలోపు బుక్ చేసుకుంటే 15 శాతం, 31 రోజుల ముందు బుక్ చేసుకుంటే 20 శాతం రాయితీ ఇస్తున్నారు. రూ. 20 వేలు స్పెషల్ హైర్ బుక్ చేసే వారికి రూ. 300, రూ. 20 వేలపైన స్పెషల్ హైర్ బుక్ చేసుకునే వారికి రూ. 500 ప్రోత్సాహకంగా అందిస్తున్నారు. రీజియన్ పరిధిలో ప్రతి నెలా 260 బస్సులు అద్దె ప్రాతిపదికన నడుపుతున్నారు. వీటి ద్వారా రూ. 33 లక్షల ఆదాయం సంస్థకు వస్తున్నది. వివాహ శుభకార్యాలకు బస్సులను అద్దెకు తీసుకున్న పెండ్లి బృందంలో వధూవరులకు ప్రత్యేక బహుమతిని డ్రైవర్లు, కండక్టర్లు, సంస్థ సిబ్బందితో అందజేస్తున్నారు. బస్సుల రాకపోకలను ఆర్టీసీ సిబ్బంది, అధికారులు ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూ, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాన్ని చేర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఆర్టీసీ బస్సులను అద్దె ప్రాతిపదికన బుక్ చేసుకుంటున్నారు.
ప్రజల సౌకర్యార్థమే ప్రత్యేక ఆఫర్లు
ప్రజల సౌకర్యార్థమే ఆర్టీసీ సంస్థ ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని అన్ని డిపోల్లో బస్సులను బుక్ చేసుకోవచ్చు. వివాహ వేడుకలు, విహారయాత్రలు, ఇతర ప్రయాణ అవసరాల కోసం బుక్ చేసుకోవచ్చు. బస్సు బుక్ చేసే సమయంలో ముందస్తు డిపాజిట్ తీసుకోవడం లేదు. అద్దె బస్సులను బుక్ చేసిన వారికి ప్రోత్సాహకం అందిస్తున్నం. సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుంది.
-ఖుస్రోషా ఖాన్, ఆర్ఎం, కరీంనగర్
సురక్షితంగా గమ్యస్థానం చేర్చడమే లక్ష్యం
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం చేర్చడమే లక్ష్యంగా ఆర్టీసీ పనిచేస్తున్నది. శుభకార్యాలు, విహారయాత్రలకు బస్సులు బుక్ చేసుకుంటే ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నం. 30 మంది ప్రయాణికుల ఉన్న చోటుకు కూడా బస్సు పంపిస్తున్నం. టికెట్ ప్రాతిపదికన కూడా బస్సులు అందుబాటులో ఉంటయి. బస్సులు బుక్ చేసుకునే వారు నేరుగా, సెల్ ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటరు.
-మల్లయ్య, డీఎం, డిపో-2
పేద, మధ్య ప్రజలకు మేలు
పెళ్లిళ్ల సీజన్లో ప్రైవేట్ బస్సులు దొరకడం ఇబ్బందిగా ఉండేది. ఒక్క బస్సును రెండు, మూడు పెళ్లిళ్లకు బుక్ చేసుకొని సమయానికి రాకపోవడంతో ఇబ్బందులు పడేవారు. ఆర్టీసీ వారు ఒక రోజు ముందు బుక్ చేసుకుంటే బస్సులను సమయానికి పంపిస్తున్నరు. అద్దె కూడా తక్కువగా ఉంది. పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంది.
–విద్యాసాగర్, నాయీబ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక నిర్వాహకులు