చొప్పదండి, మే 27: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. చొప్పదండి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ చిలుక రవీందర్ అధ్యక్షతన శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో సాధించామన్నారు. పల్లెప్రగతితో గ్రామాల రూపురేఖలు మారినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల్లో రోడ్లు, మురుగు కాలువలు సక్రమంగా లేక ప్రజలు అంటువ్యాధుల బారిన పడి దవాఖానల చుట్టూ తిరిగేవారని, పల్లెప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెంది కరోనాలాంటి మహమ్మారిని పారద్రోలామని అన్నారు.
గ్రామ పంచాయతీలకు పల్లెప్రగతి ద్వారా నేరుగా రూ.3 కోట్లు అందజేస్తూ గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. ప్రజారోగాన్ని దృష్టిలో ఉంచుకొని పల్లె దవాఖానలను మంజూరు చేసినట్లు తెలిపారు. జూన్ నుంచి ప్రారంభమయ్యే పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల వివరాలు సేకరించి, మరింత అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. నియోజకవర్గంలో మోతె రిజర్వాయర్‌కు ప్రత్యామ్నాయంగా ఓటీలను మంజూరు చేసి, 30 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధికి రూ. 550 కోట్లు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. చొప్పదండి పట్టణంలో సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆశీస్సులతో రూ. 77 కోట్ల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు విన్నవించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కాగా, సమావేశంలో ప్రజాప్రతినిధులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీడీవో స్వరూప, తహసీల్దార్ రజిత, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.