కోరుట్ల/కోరుట్ల రూరల్, మే 27: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. పట్టణంలోని బీసీ కాలనీ, కల్లూరు రోడ్డు ఎంపీపీఎస్, ఎఖీన్‌పూర్ ఎంపీపీఎస్, మండలంలోని మాదాపూర్, పైడిమడుగు గ్రామాల్లో ‘మన ఊరు-మన బడి’ పథకానికి ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఎమ్మెల్యే శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్‌కు దీటుగా నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కార్యక్రమానికి రూపకల్పన చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు.
పాఠశాల విద్యకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు వెచ్చిస్తుందన్నారు. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని కలెక్టర్ రవి గుగులోత్ పేర్కొన్నారు. పట్టణంలోని బీసీ కాలనీ మార్కండేయ వీధి ఎంపీపీఎస్ పాఠశాలలో ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి మొదటి విడుతలో జిల్లాలోని 274 పాఠశాలలు ఎంపికైనట్లు తెలిపారు. ప్రస్తుతం 95 పాఠశాలలను మౌలిక వసతుల నిర్వహణకు ఎంపిక చేశామన్నారు. అంతకుముందు పట్టణంలో కల్లూరు రోడ్డులో నూతనంగా నిర్మించిన సమీకృత కూరగాయల మార్కెట్‌తోపాటు ప్రభు త్వ బాలికల ఉన్నత పాఠశాలను పరిశీలించారు.
కూరగాయల మార్కెట్లో ఏర్పాటు చేసిన షెడ్లు, మౌలిక వసతులు, ఏర్పాట్లను సమీక్షించారు. కాగా, ఎకీన్పూర్, మాదాపూర్, పైడి మడుగు గ్రామాల్లో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అలాగే మాదాపూర్, కల్లూరు, జోగిన్‌పల్లి, వెంకటాపూర్ గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు దళితబందు ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య, వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావ్, కోరుట్ల ఆర్డీవో వినోద్‌కుమార్, జడ్పీటీసీ దారిశెట్టి లావణ్య, ఎంపీపీ తోట నారాయణ, ఏఎం సీ చైర్పర్సన్ గుడ్ల లక్ష్మి, వైస్ చైర్మన్ కాశిరెడ్డి మోహన్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్, ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్, సర్పంచుల ఫోరం జిల్లా గౌరవాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, సర్పంచ్ దమ్మ భీమ్‌రెడ్డి, ఎంపీటీసీ కృష్ణారెడ్డి, గడిగొప్పుల మాధురి, విండో అధ్యక్షులు సింగిరెడ్డి నర్సారెడ్డి, అయిల్నేని జగన్మోహన్రావు, గడ్డం ఆదిరెడ్డి, బండి భూమయ్య, ఎంపీడీవో నీరజ, పీఆర్ ఏఈ ఆదిత్య, ఎంఈ వో నరేశం, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.