విద్యానగర్, మే 27: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఆక్షేపణీయమని కరీంనగర్ వెలమ సంఘం నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఏమిటో.. వారు ఏం చేస్తరో చెప్పుకొని ప్రజల్లోకి పోకుండా కేవలం రెడ్లకే పాలించే సత్తా ఉందని మిగతా కులాలను కించపరిచే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇప్పుడే ఇంత కుల అహంకారం ఉంటే పొరపాటున అధికారంలోకి వస్తే ఇతర కులాలను ఎలా చూస్తరో ప్రజలకు అర్థమైందన్నారు. రెడ్డి కులస్తులు రాజ్యమేలాలనే రేవంత్ మాటల ద్వారా అన్నదమ్ముల్లా కలిసుండే తెలంగాణ ప్రజల్లో విబేధాలు వచ్చేలా ఉన్నాయని విమర్శించారు.
ఇది సమాజానికి మంచిది కాదన్నారు. పదేపదే వెలమ కులంపై విష ప్రచారం చేస్తున్న రేవంత్‌రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కరీంనగర్ వెలమ నాయకులు, ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చీటి ప్రకాశ్‌రావు, మాజీ ప్రధాన కార్యదర్శులు బోయినపల్లి ప్రవీణ్‌రావు, జువ్వాడి వేణుగోపాల్‌రావు, మాజీ జాయింట్ సెక్రటరీ జోగినపల్లి రఘునందన్‌రావు, మాజీ ఈసీ మెంబర్ చీటి ప్రతాప్రావు, ప్రముఖ న్యాయవాది పొనుగోటి గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.