సిరిసిల్ల, మే 26: జిల్లాల్లోని చాలా గ్రామాల్లోని పాఠశాల ఆవరణలో ఉండే మైదానాల్లోనే ఇప్పటిదాకా పిల్లలు ఆటలు ఆడుతుండగా, క్రీడాకారులూ అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే, అవికూడా మెజార్టీ గ్రామాల్లో మైదానాలు లేకపోవడంతో పిల్లలు చదువుపైనే దృష్టిసారిస్తూ శారీరక శ్రమకు దూరమవుతున్నారు. చదువే కాదు పిల్లలకు క్రీడలూ ముఖ్యమేనని రాష్ట్ర సర్కారు గుర్తించింది. గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహమివ్వాలని సంకల్పించి, గ్రామానికో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే పల్లె ప్రగతి కింద గ్రామాలను సుందరంగా మార్చుతుండగా, అదే కార్యక్రమం కింద పల్లెల్లో 20 గుంటల నుంచి ఎకరం స్థలంలో ‘తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణం’ పేరిట మైదానాలు అభివృద్ధి చేయాలని ఈ నెల 18న ప్రగతి భవన్లో జరిగిన మీటింగ్‌లో సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాల యంత్రాంగం రంగంలోకి దిగాయి. స్థలాల గుర్తింపులో నిమగ్నమయ్యాయి.
పల్లె ప్రగతిలోనే ఏర్పాటు
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు దేశంలో ఎక్కడా లేనివిధంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రతి నెలా గ్రామాలకే నేరుగా నిధులు ఇస్తుండగా, గడిచిన ఏడాదిన్నరలో గ్రామాల రూపురేఖలే మారిపోయాయి. గ్రామ గ్రామాన ప్రకృతి వనం, నర్సరీలు, చెత్త తరలింపునకు డంపింగ్‌యార్డ్, వైకుంఠధామాలు తదితరాల సౌకర్యాలను రాష్ట్ర సర్కారు కల్పించింది. అయితే ఇప్పుడు ఈ ఆట స్థలాలను కూడా పల్లె ప్రగతిలో భాగంగానే సకల సౌకర్యాలతో ఏర్పాటు చేయబోతున్నది.
245 హ్యాబిటేషన్లలో స్థలాల గుర్తింపు
ప్రభుత్వ ఆదేశాలు రావడమే తరువాయి రాజన్న సిరిసిల్ల జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగి చకచకా పని పూర్తి చేస్తున్నది. జిల్లాలో 255 గ్రామపంచాయతీల్లో మొత్తం 267 హ్యాబిటేషన్లలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు 245 హ్యాబిటేషన్‌లో స్థలాలను ఎంపిక చేశారు. సర్వే నంబర్లు, అందుబాటులోని స్థలాల వివరాలు కలెక్టర్‌కు నివేదించారు. ఆయా మండలాల వారీగా రెవెన్యూ అధికారులు స్థలాలను గుర్తించి సర్వే చేసి అధికారులకు నివేదించారు. ఎంపిక చేసిన హ్యాబిటేషన్‌లో ప్రభుత్వ స్థలాలు లేకపోతే దాతలు ఎవరైనా మైదానం ఏర్పాటుకు స్థలాలు విరాళాలు ఇవ్వవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. స్థలాల ఎంపిక కోసం సంబంధిత ఎంపీడీఓలు, ఎంపీవోలు నిమగ్నమయ్యారు. కాగా, అభివృద్ధి చేసిన క్రీడా ప్రాంగణాలను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన వచ్చే నెల 2న ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు గ్రామాల్లో క్రీడలు నిర్వహించేందుకు గ్రామీణ క్రీడా కమిటీలను ఏర్పాటు చేసి బాధ్యతలను అప్పగించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.
ఎకరంలో ఏర్పాటు
క్రీడా ప్రాంగణాల కోసం అధికారులు స్థల సేకరణ పనుల్లో నిమగ్నమయ్యారు. గ్రామానికి దగ్గరలో కనీసం ఎకరంలో ఆటస్థలం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దాదాపు 20 గుంటల నుంచి ఎకరం పైగా ఉన్న స్థలాలను సేకరిస్తున్నారు. జాగ దొరకని గ్రామాల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రక్రియ వేగవంతమైంది.
క్రీడా ప్రాంగణానికి ముస్తాబు ఇలా..
ప్రభుత్వం ఎంపిక చేసిన క్రీడా స్థలాల్లో రాళ్లు, ముళ్ల పొదలు ఉంటే తొలగించి ఆటలు ఆడుకునేందుకు అనువుగా మార్చుతారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు ప్రారంభమయ్యాయి. మైదానాన్ని చదును చేసిన అనంతరం చుట్టూ కనీసం రెండు వరుసల్లో గుంతలు తవ్వించి వివిధ రకాల మొక్కలు నాటుతారు. ఇందులో చక్కటి నీడను ఇచ్చే పెద్ద మొక్కలు నాటనున్నారు. పశువులు, మేకలు, ఇతర జంతువులు మైదానంలోకి రాకుండా ఆట స్థలం చుట్టూ బయో ఫెన్సింగ్ సైతం ఏర్పాటు చేయనున్నారు.