కలెక్టరేట్, మే 26 : కరీంనగర్ పార్లమెంటు ప్రజల సానుభూతి ఓట్లతో ఎంపీగా గెలిచిన బండి సంజయ్ దేశంలో ముస్లింల చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని ఎంఐఎం జిల్లా ఇంచార్జి సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు. గురువారం నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయం దారుస్సలాంలో విలేకరులతో మాట్లాడుతూ, బుధవారం రాత్రి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముస్లిం రాజుల ఏలుబడిలో, బ్రిటిష్ పాలకుల కాలం నాటి నుంచి హిందూముస్లింలు భాయ్ భాయ్ అంటూ కలిసి మెలిసి ఉంటున్న విషయం గ్రహించాలన్నారు. మసీదు, దర్గా, ఈద్గా, అసుర్ఖానాకు తేడా తెల్వని బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతుండడం సిగ్గుచేటని విమర్శించారు. మూడేళ్లుగా ఎంపీగా తన సెగ్మెంట్లో ఎలాంటి అభివృద్ధి పను లు చేయకపోగా, వైషమ్యాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పబ్బం గడుపుకుంటున్నాడని ధ్వజమెత్తారు.
ఓటు బ్యాంకు రాజకీయాలతో ప్రజలను మోసం చేసే యత్నం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. తన పార్టీలోని ప్రజాప్రతినిధులు, కార్యకర్తల పట్ల ఆయన అనుసరిస్తున్న తీరుతో విసుగు చెంది, టీఆర్ఎస్పార్టీలో చేరుతున్న వైనం అందరికీ తెల్సిందేనన్నారు. కరీంనగర్ బీజేపీలో రాజకీయ శూన్యత ఏర్పడుతున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి, అవాకులు, చవాకులు పేలుతున్నాడని దుయ్యబట్టారు. దమ్ము, ధైర్యముంటే అభివృద్ధిలో టీఆర్ఎస్ ఎంపీలతో పోటీ పడాలని హితవు పలికారు. పైరవీలు, సెటిల్మెంట్లతో వందల కోట్ల కు ఎంపీ సంజయ్ పడగలెత్తుతుంటే, తనను నమ్ముకున్న కార్యకర్తలు మాత్రం తిండికి లేక పస్తులుంటున్న విషయం వాస్తవం కాదా ? చెప్పాలన్నారు.
2019 ఎన్నికల్లో కరీంనగర్ ప్రజలకిచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని, ఆనాడు ఆయన వెంట ఉన్న నేతలు, కార్యకర్తలు ఇప్పుడు తప్పుకోవడం వెనుక కారణమిదేనని స్పష్టం చే శారు. ఏడేళ్లలో మోదీ ప్రభుత్వం రూ.80వేల కోట్ల అప్పుతో దేశాన్ని దివాలా తీయించిందని ఆరోపించారు. ఏడు దశాబ్దాల భారతావనిలో ఏనాడూ లేని వైషమ్యాలు, 2014 నుంచి మాత్ర మే మొదలయ్యాయన్నారు. దేశ సమగ్రత కోసం పాటుపడుతున్న తమ పార్టీ అధినేత అసదుద్దీన్ సవాల్ చేసే దమ్ము, నైతికత బండి సంజయ్కు లేదన్నారు. పార్లమెంటు సభ్యుడిగా ఓవైసీ పాతబస్తీలోని ఒక గల్లీలో చేసిన అభివృద్ధి కూడా, కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఎక్కడా బండి సంజ య్ చేయలేదన్నారు. ఎంపీగా గెలిచిన అనంతరం చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రేలాపనలతో రెచ్చగొట్టే య త్నం చేస్తే, నీతి, నిజాయితీకి మారుపేరైన ముస్లిం లు రెచ్చిపోరనే విషయం గమనించాలన్నారు.