తెలంగాణచౌక్, మే 26: బీజేపీతో దేశానికి పెను ప్రమాదమని, మత విద్వేషాలను సృష్టించి రాజకీయలబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నదని తెలంగాణ ప్రజాసంఘల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం మండిపడ్డారు. ఆ పార్టీ ఆటలు ఇక సాగవని, దేశ ప్రజలు బుద్ధి చేప్పేరోజులు ముందున్నాయని హెచ్చరించారు. గురువారం నగరంలోని శ్వేత హోటల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగాన్ని మార్చాలని కేంద్రంలో ప్రధాని మోడీ, అమిత్షా కుట్రలు చేస్తున్నారని, రాష్ట్రంలో బీజేపీ ఎమ్యెల్యే రాజాసింగ్, ఎంపీ అర్వింద్ ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాగం జోలికి వస్తే బీజేపీకి దళిత, గిరిజన, బీసీ, మైనార్టీల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో యేటా దక్కాల్సిన 40 లక్షల ఉద్యోగాలను ఎందుకు ఇవ్వడంలేదో బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ యువతను మోసం చేసిన బీజేపీ.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ పేరుతో యువతన రెచ్చగొడుతూ తప్పుదారి పట్టిస్తున్నదని, నమ్మొద్దని కోరారు. ప్రధాని తన మాటలతో ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని, మాటల్లో కాదని చేతల్లో చూపిస్తే బాగుంటుందని హితవుపలికారు. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తొలగించేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని, ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయడం లేదని విమర్శించారు. నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి పేద కుటుంబానికి రూ.15 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్న మోడీ, ఎనిమిదేండ్లయినా ఎందుకు జమచేయడం లేదో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.
అధికారం కోసం ప్రజలను మోసం చేయడం బీజేపీ నాయకులకు అలవాటు అని, రాముడి పేరుతో ఓట్లు దండుకోవడం, ఎన్నికలు వచ్చినపుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చేందుకు కుట్ర చేయడమే వారికి తెలుసునని మండిపడ్డారు. బండి సంజయ్ వ్యాఖ్యలు ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని, రెండ్రోజుల క్రితం కరీంనగర్లో మాట్లాడిన మాటలతో ఆయన నిజస్వరూపం బయటపడిందని ధ్వజమెత్తారు. మతోన్మాదంలో ప్రజలను విభజించేందుకు బండి కుట్ర చేస్తున్నట్లు తెలుస్తున్నదని మండిపడ్డారు.
రాజ్యాంగం మీద నమ్మకం లేని బండికి.. గెలిపించిన ప్రజలకు సేవ చేసే అర్హత లేదని స్పష్టం చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కాదని, ఎంపీగా గెలిచిన తర్వాత కరీంనగర్ అభివృద్ధికి ఎంత బడ్జెట్ తీసుకువచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఉద్యోగాలను ప్రకటిస్తే, కేంద్ర ప్రభుత్వ నుంచి ఉద్యోగాల ప్రకటన ఎందుకు రావడంలేదో బండి సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కలేనని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. ఇక్కడ సీనియర్ నాయకులు గజ్జెల ఆనందం, జిల్లా అధ్యక్షుడు సముద్రాల అజయ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభాకర్, లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు దేవయ్య, ఎస్కే సుల్లాన పాల్గొన్నారు,
బండి సంజయ్.. రామాయణం చదువు
శ్రీరాముడు పుత్రుడిగా, సోదరుడిగా, స్నేహితుడిగా, పాలకుడిగా ప్రజల మెప్పు పొందారు. కరీంనగర్లో గురువారం ఎంపీ బండి సంజయ్ మాట్లాడిన మాటలకు శ్రీరాముడి పాలనకు ఏ మాత్రం పొంతన లేదు. శ్రీరాముడు ఎల్లప్పుడూ ప్రజలు ఆనందంగా, సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాడు తప్ప, ప్రజలను విభజించి పాలించాలని ఎప్పుడూ కోరుకోలేదు. అందుకే బండి సంజయ్ కుమార్ నీవు రామరాజ్యం అంటే ఏమిటో.. రామరాజ్యంలో ప్రజలు ఏవిధమైన పాలన పొందారో తెలుసుకుంటే మంచిది. ప్రతి ఒకరూ పరమత సహనం పాటించాలి. ఒకరి ధర్మంపై మరొకరు విద్వేష పూరిత వ్యాఖ్యలు చేయడం సరికాదు.
– కాంగ్రెస్ నగర కమిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (రాంనగర్)