కలెక్టరేట్, మే 26: 8వ విడుత హరితహారం కార్యక్రమం జిల్లాలో విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. నిర్దేశించిన లక్ష్యం 47 లక్షల మొక్కలు నాటేందుకు అవసరమైన ప్రణాళికలు కూడా అధికారులు రూపొందించారు. ఈసారి చెరువు కట్టలు, క్రీడా ప్రాంగణాల్లో అధికంగా మొక్కలు నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి ఆయా విభాగాల అధికారులకు బాధ్యతలు అప్పగించి, కింది స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడూ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేస్తూ, కలెక్టరేట్ సమావేశమందిరంలో అధికార యంత్రాంగంతో నిత్యం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈసారి వంద ఎకరాలకు పైబడి ఉన్న చెరువుల స్థలాలను గుర్తించి, పెద్ద సంఖ్యలో మొక్కలు నాటేలా నీటి పారుదల శాఖ అధికారులకు గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సూచించారు. చెరువుల సమీపంలో ఇప్పటికే ఉన్న పెద్ద మొక్కలు తొలగించకుండా, కొత్తగా ఔషధ మొక్కలు నాటాలని, తద్వారా దేశ, విదేశాల వలస పక్షులను కూడా ఎక్కువగా ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. రోడ్ల కిరువైపులా, ఎల్ఎండీతో పాటు జిల్లాలోని ఎస్సారెస్పీ కెనాల్ కట్ట పక్కన మొక్కలు నాటేలా చర్యలు చేపడుతున్నారు. క్రీడా మైదానాల సరిహద్దుల వెంట కూడా మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
గతంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనాలు మినీ ఫారెస్టును తలపిస్తున్న నేపథ్యంలో ఈసారి ప్రతి మండలంలో మరో నాలుగు ఏర్పాటు చేసేందుకు అధికారులను ఆదేశించారు. దీంతో ఐదెకరాల ప్రభుత్వ స్థలమున్న గ్రామాలను గుర్తించే పనిలో సంబంధితాధికారులు నిమగ్నమయ్యారు. గతంలో నాటిన మొక్కలు ఎండిపోతే, వాటి స్థానంలో తిరిగి నాటుతూ మోడల్ బృహత్ పల్లె ప్రకృతి వనాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. వీటిని క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్‌కు బాధ్యతలు అప్పగించారు. కాగా, గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా అటవీ అధికారి సీహెచ్ బాలమణి, జిల్లా ఇరిగేషన్ అధికారి అస్మత్ అలీ, డీఆర్డీవో ఎల్ శ్రీలతారెడ్డి, ఈఈ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.