చొప్పదండి, మే 26: రైతులు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం వెంటవెంటనే కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్‌లాల్ నిర్వాహకులను ఆదేశించారు. మండలంలోని రుక్మాపూర్ గ్రామంలో సింగిల్‌విండో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, రైతులతో మాట్లాడి కొనుగోళ్లను తీరును అడిగి తెలుసుకున్నారు. వర్షాలు పడే సూచనలు ఉన్నందున తూకం వేసిన ధాన్యం వెంట వెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ వెల్మ మల్లారెడ్డి మాట్లాడుతూ, మిల్లులో కోటా నిండిపోయిందని ధాన్యం తీసుకుంటలేరని విన్నవించారు. మిల్లర్లతో మాట్లాడి ధాన్యం తీసుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ రజిత, సర్పంచ్ చిలుక లింగయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.
భూపాలపట్నంలో..
చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ వెల్మ మల్లారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు అధైర్యపడొద్దని ప్రతి ధాన్యపు గింజనూ కొంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట సింగిల్‌విండో డైరెక్టర్ నాంపెల్లి మల్లయ్య, రైతులు కిట్టుగౌడ్, చందు, రవి, రైతులు తదితరులు ఉన్నారు.