కలెక్టరేట్, మే 22: సమాజంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ప్రస్తుత వాతావరణం, ఆహారపు అలవాట్లలో మార్పులు, రసాయనిక ఎరువులతో పండించిన ఆహార పదార్థాలు వెరసి మానవుని శరీరం విషతుల్యమవుతున్నది. 40 ఏళ్లలోపే బీపీ, షుగర్, గుండె జబ్బులు వంటివి వస్తున్నాయి. ఈనేపథ్యంలో ఆరోగ్యానికి హాని కలిగించే ఫాస్ట్ ఫుడ్, నూనె వస్తువులు అంత శ్రేయసరం కాదని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో, నాడు పేద, మధ్య తరగతి కుటుంబీకులు తిన్న ఆహారమే నేడు అన్ని వర్గాలకు దివ్య ఔషధంగా మారింది. కార్పొరేట్ వ్యాపారుల నుంచి రిక్షా తొకే సామాన్యుడి వరకు నోరూరించే వంటకాలకు స్వస్తి చెబుతూ, పూర్వకాలం నాటి జొన్న, సజ్జ గటుక, రొట్టెలు, జావ వైపు దృష్టి మళ్లించారు. దీంతో ప్రస్తుతం మారెట్లో కిలో బియ్యం రూ .50 ఉండగా, తెల్ల జొన్నల ధర రూ .70 పలుకుతున్నది. గ్రామాలు, పట్టణాల్లో ఎకడ చూసినా జొన్నరొట్టెల తయారీ కేంద్రాలు వెలుస్తున్నాయి. ఇండ్లల్లో కూడా అనేక మంది అన్నం బదులు జొన్న పిండితో తయారు చేసిన ఆహారం తీసుకుంటున్నారు. పలు రకాల ధాన్యపు గింజలు కలిపి నూనె లేకుండా రొట్టెలు చేసుకొని తింటున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో తెల్ల జొన్నలకు డిమాండ్ పెరిగింది.
పోషక విలువలు పుష్కలం
ఫైబర్ పుషలంగా లభించే తెల్ల జొన్నలు, రాగులు, సజ్జల్లో అనేక పోషక విలువలు ఉన్నాయి. వీటితో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా శరీరంలో చకెర నిల్వలు తగ్గి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. మధుమేహం ఉన్న వారు జొన్నలు, రాగులు, సజ్జల వాడకాన్ని అధికం చేస్తున్నారు. మంచి పోషక విలువలున్న ఆహారం కావడంతో వైద్యులు సైతం వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. మధుమేహం, బీపీ, ఇతర దీర్ఘకాలిక వ్యాధులున్న వారికీ తినాలని సూచిస్తున్నారు. దీంతో నగరంలో జొన్న రొట్టెలు తయారు చేస్తున్న వారికి ఉపాధి దొరుకుతున్నది. వీధికో పొయ్యి ఏర్పాటు చేసి కొనుగోలుదారుల ఎదుటనే తయారు చేస్తూ, అందజేస్తున్నారు. వేడివేడిగా ఉంటుండడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో నగర వాసులు వీటిని ఇండ్లకు తీసుకెళ్లి ఇంటిల్లి పాది అల్పాహారంగా తీసుకుంటున్నారు.
ఉపాధి దొరుకుతున్నది
పొట్టకూటి కోసం జిల్లాలోని పంతులు తండా నుంచి నగరానికి వలస వచ్చినం. కిరాయి ఇంట్ల ఉండి సొంతంగా మా కాళ్లపై మేము బతకాలని జొన్న రొట్టెల వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నం. పెద్దగా పెట్టుబడి అవసరం లేకుండా వ్యాపారం మొదలుపెట్టినం. ఒక్కో రొట్టె రూ .15 చొప్పున అమ్ముతున్న. రోజుకు 50 రొట్టెల దాకా అమ్మి రూ.750 వరకు సంపాదిస్తున్న.
– కమల, జొన్న రొట్టెల వ్యాపారి