మానకొండూర్ రూరల్, మే 22: తెల్లారకముందే మందీమార్బలం లేకుండా పల్లెకు చేరుకుంటాడు.. ఆత్మీయంగా పలుకరిస్తూ ప్రజలతో మమేకమవుతాడు.. బాగోగులను అడిగి తెలుసుకుంటాడు.. వారి సమస్యలను సావధానంగా విని అక్కడికక్కడే పరిష్కరిస్తుంటాడు.. ఇలా రోజుకో గ్రామంలో పర్యటిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున మానకొండూర్ మండలం అన్నారం శివారులోని తోటకుంట పల్లెకు వెళ్లారు. వృద్ధులను ఆత్మీయంగా పలుకరిస్తూ ముందుకెళ్లారు. ఆయన్ను చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అంతలోనే తేరుకొని ఆయన వద్దకు చేరుకుని సమస్యలను ఏకరువు పెట్టారు. వీధి దీపాలు వెలుగడం లేదని, బోరుబావులు చెడిపోయాయని, భగీరథ నీరు రావడంలేదని చెప్పారు. ముఖ్యంగా రేషన్ సరుకుల కోసం అన్నారం వెళ్లాల్సివస్తున్నదని వాపోయారు. దీంతో తహసీల్దార్‌తో మాట్లాడిన ఎమ్మెల్యే స్థానికంగా రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే పింఛన్లు అందని వారి వివరాలు తెలుసుకొని సాధ్యమైనంత త్వరగా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కాగా, గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను గ్రామస్తులు శాలువాలతో సన్మానించి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శేఖర్ గౌడ్, సర్పంచ్ బొట్ల కిషన్, ఎంపీటీసీ రాజనర్సు, నాయకులు పురం అనిల్ కుమార్, నెల్లి శంకర్, నెల్లి మురళి, తాళ్ల శేఖర్, గ్రామస్తులు ఉన్నారు.