జమ్మికుంట, మే19: ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలు రాసే విద్యార్థులు వందశాతం ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు సూచించారు. గురువారం ఆయన జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ బాలుర, బాలికల, ఆబాది, మండలంలోని వావిలాల పాఠశాల, న్యూమిలీనియం, ఎస్వీ ప్రైవేట్ పాఠశాలల్లో జరిగే పదో తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఈవో, హెచ్ఎం, ఉపాధ్యాయులకు తగు సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు సక్రమంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వాటి ముందే పరీక్షా పత్రాలను ఓపెన్ చేయాలని చెప్పారు.
పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఫ్యాన్లు, నీళ్లు, లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని చెప్పారు. ఏమైనా ఇబ్బందులుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పరీక్షలు నిర్వహించేందుకు వచ్చే ఇన్విజిలేటర్లతో సమావేశం ఏర్పాటు చేసుకుని, నిబంధనలపై అవగాహన కల్పించాలని చెప్పారు. పరీక్షా కేంద్రాల నిర్వహణ, తదితర అంశాలపై నివేదిక ఇవ్వాలని మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్‌ను ఆదేశించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. ఆయా పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. విద్యార్థులతో మాట్లాడి భయం లేకుండా పరీక్షలు రాయాలని ధైర్యాన్నిచ్చారు. ఇక్కడ మండల విద్యాధికారి శ్రీనివాస్, సీఎస్‌లు, డీవోలు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
పరీక్షా కేంద్రాల సందర్శన
మండలంలోని పదో తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు గురువారం సందర్శించారు. ఇక్కడ సౌకర్యాలపై ఎంఈవో సుధాకర్‌ను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, ఫ్యాన్లు, సీసీ కెమెరాల పని తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇక్కడ చీఫ్ సూపరింటెండెంట్ సాంబయ్య, ఉపాధ్యాయులు, సీఆర్పీలు తదితరులు ఉన్నారు.