తిమ్మాపూర్ రూరల్, మే14: పల్లెలన్నింటినీ పచ్చహారంగా మార్చాలనే సంకల్పంతో తెలంగాణ ప్ర భుత్వం యేటా నిర్వహిస్తున్న హరితహారం ఎనిమిదో విడతను విజయవంతం చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో నర్సరీల ద్వారా మొక్కలు పెంచుతుండగా.. ఎండలకు అవి వాడిపోకుండా, చనిపోకుండా షెడ్ నెట్ ద్వారా కాపాడుతున్నారు. మరో నెల రోజుల్లో హరితహారం ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘నమస్తే’ ప్రత్యేక కథనం..
మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం కింద నర్సరీలను నిర్వహిస్తున్నారు. మండలానికి 2లక్షల 65వేల మొక్కలు టార్గెట్ కాగా, ప్రస్తుతం 2.20 లక్షలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన మొక్కలను ఎండిపోయిన, మొలవని ఖాళీ మొక్కల కవర్లలో నింపడానికి సిద్ధం చేస్తున్నారు. నర్సరీల నిర్వహణకు ప్రతీ గ్రామంలో ఒక వనసేవకురాలిని నియమించా రు. ఈ వనసేవకులే నర్సరీ పర్యవేక్షణ, నీళ్లు పట్ట డం, విత్తనాలు వేయడం, మట్టిని బ్యాగుల్లో నింప డం లాంటి అన్ని పనులు చేస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణ..
మొక్కలు ఎండిపోవద్దనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం షెడ్ నెట్లు ఇవ్వగా, ప్రతీ గ్రామంలో నిర్వహిస్తున్న నర్సరీల్లో పకడ్బందీగా ఏర్పాటు చేశారు. దీంతో గతంతో పోలిస్తే ఈ సారి ఎండలకు మొక్కల మరణ సంఖ్య చాలా వరకు తగ్గాయి. ప్రతీ రోజు రెండు సార్లు నీళ్లు పట్టడం చేస్తున్నారు. నర్సరీలను ప్రతినిత్యం జిల్లా, మండల అధికారులతో పాటూ ఉపాధి సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.
మొక్కల పంపిణీకి ప్రణాళికలు..
ఈసారి హరితహారం మొక్కలను గ్రామాల్లో ఇవ్వడంతో పాటూ గ్రామస్తులకు ఇండ్లకు కూడా అం దించడానికి ప్రణాళికలు చేస్తున్నారు. గ్రామమం తా పచ్చదనం పరువాలనే లక్ష్యంతో నీడనిచ్చే, పండ్ల మొక్కలకు ప్రాధాన్యం ఇచ్చారు. నర్సరీల్లో కబంద, చింత, కానుగ, గుల్మర్, సీతాఫలం, నిమ్మ, దానిమ్మ, జామ, గులాబీ, మల్లె తదితర మొక్కలు పెంచుతున్నారు.
నిరంతరం పర్యవేక్షిస్తున్నాం..
ఎనిమిదో విడుత హరితహారానికి మొక్కలను సిద్ధం చేస్తున్నాం. మండల టార్గెట్ మేర కు ప్రణాళికబద్ధంగా పెంచాం. ఇంకా కొన్ని మొక్కలను ఖాళీ బ్యాగుల్లో విత్తాలని సూచిం చాం. అలాగే మొక్కలు ఎండలకు ఎం డిపోకుండా రక్షణ చర్యలు చేపడుతున్నాం. షెడ్ నెట్ల కింద ఎండదెబ్బ తగలకుండా పెంచుతున్నాం. 23నర్సరీలను నిత్యం పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలు చేస్తున్నాం.
– రవీందర్రెడ్డి, ఎంపీడీవో, తిమ్మాపూర్