గంగాధర, మే 12: గర్శకుర్తి బడి ప్రయోగాలకు చిరునామాగా మారింది. ఉపాధ్యాయుల ప్రోత్సాహం.. విద్యార్థుల అకుంఠిత దీక్ష, సృజనాత్మకతతో అద్భుత ఆవిష్కరణకు నిలయంగా మారింది. విద్యార్థులు తయారుచేసిన నమూనాలు ఏటాటా జాతీయ, రాష్ట్ర స్థాయిలో కాకుండా ఏకంగా ఇస్రోకు ఎంపికవుతుండడంతో మిగతా పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
గంగాధర మండలం గర్శకుర్తి ప్రభుత్వ పాఠశాల వినూత్న ప్రయోగాలకు చిరునామాగా మారింది. ఇక్కడి ఉపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు రైతులు, చేనేత కార్మికులకు ఉపయోగపడే విధంగా వినూత్న ప్రయోగాలు చేస్తూ పాఠశాలను ఆదర్శంగా నిలుపుతున్నారు. ప్రధానోపాధ్యాయుడు అశోక్ రెడ్డి, గైడ్ టీచర్ జగదీశ్వర్ రెడ్డి ప్రోత్సాహంతో విద్యార్థులు తయారు చేసిన పలు ప్రయోగాలు జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ఆవిష్కరణ పోటీలకు ఎంపిక కావడంతో పాటు శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో ప్రశంసలు అందుకుంటున్నారు. ముగ్గురు విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలు ప్రతిష్టాత్మక ఇస్రోకు ఎంపిక కావడం ఇక్కడి పాఠశాల విద్యార్థుల నిరంతర దీక్షకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి.
సోలార్ మల్టీ అగ్రికట్టర్
గంగాధర మండలం గర్శకుర్తి గ్రామానికి చెందిన మిట్టపల్లి శ్రీకాంత్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతుండగా (ప్రస్తుతం గంగాధర మోడల్ స్కూల్లో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్నాడు) తయారు చేసిన సోలార్ మల్టీ అగ్రికట్టర్ ప్రయోగం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 2018-19 జాతీయ స్థాయిలో యువ విజ్ఞానిక కార్యక్రమానికి ఎంపికైంది. సైన్స్ ప్రయోగాలు చేయడంలో ముందుండే శ్రీకాంత్ జేఎన్ఎస్ఎఫ్ సైన్స్‌ఫెయిర్‌లో తాను తయారు చేసిన వర్షం బారి నుంచి పంటలను కాపాడే ప్రయోగం జాతీయస్థాయికి ఎంపికైంది. ఇన్స్పైర్ కార్యక్రమంలో తయారు చేసిన సోలార్ మల్టీ కట్టర్ రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకుంది. దీంతో ఇస్రో ఆధ్వర్యంలో 13 రోజుల పాటు నిర్వహించిన యువ విజ్ఞాని కార్యక్రమానికి శ్రీకాంత్ ఎంపికయ్యాడు. ఇక్కడ ప్రముఖ శాస్త్రవేత్తలు డాక్టర్ వెంకటక్రిష్ణన్, డాక్టర్ బీఎన్ సురేశ్, డాక్టర్ వేదాచలం, డాక్టర్ రాధాక్రిష్ణన్, డాక్టర్ వీర రాఘవన్‌తో ప్రయోగాల తయారీ గురించి ముఖాముఖిలో పాల్గొన్నాడు. రాకెట్ తయారీ, శాటిలైట్ తయారీ, ప్రయోగం, లాంచింగ్ విధానాన్ని తెలుసుకున్నట్లు, బెలూన్ లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు.
పూరీ మేకర్ తయారీ
గర్శకుర్తి గ్రామానికి చెందిన దూస ప్రత్యూష స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ప్రత్యూష తయారు చేసిన పూరీ మేకర్ ప్రయోగం 2021-22 జాతీయ స్థాయిలో యువ విజ్ఞాని కార్యక్రమానికి ఎంపికైంది. పిండి వంటలు చేయడంలో శారీరక శ్రమను తగ్గించడంతో పాటు సమయాన్ని ఆదా చేసేందుకు ప్రత్యూష పూరీ మేకర్‌ను తయారు చేసింది. స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్‌లో భాగంగా ప్రత్యూష తయారు చేసిన పూరీ మేకర్ ప్రశంసలు అందుకోవడంతో పాటు యువ విజ్ఞాన్ కార్యక్రమానికి ఎంపికైంది. ఈ నెల 16 నుంచి 28వ తేదీ వరకు హైదరాబాద్‌లో బాలనగర్‌లోని ఇస్రో కేంద్రం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలతో ముఖాముఖి, ఇస్రో ల్యాబ్ సందర్శన , రాకెట్ లాంచింగ్ ప్రయోగంపై శిక్షణ, షార్ శ్రీహరికోట సందర్శన కార్యక్రమంలో ప్రత్యూష పాల్గొంటుంది.
కలుపు నివారణ సులభం
గర్శకుర్తి గ్రామానికి చెందిన చిప్ప శివాణిశ్రీ 9వ తరగతి చదువుతుండగా (ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతోంది) తయరు చేసిన కలుపు నివారణ యంత్రం ప్రయోగం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) సంస్థ ఆధ్వర్యంలో 2019-20లో నిర్వహించిన యువ విజ్ఞాన్ కార్యక్రమానికి ఎంపికైంది. ఈ యంత్ర ం ద్వారా 6 గంటల్లో ఎకరం పొలంలో కలుపును తీయడం వల్ల సమయం, ఖర్చులు ఆదా అవుతాయి. యంత్రాన్ని తయారు చేసేందుకు రూ.25 వేలు ఖర్చు కాగా, 2 గంటల పాటు బ్యాటరీని చార్జింగ్ పెడితే 3 గంటల పాటు కలుపు తీయవచ్చు. కాగా గతేడాది కరోనా ప్రభావం వల్ల యువ విజ్ఞాన్ కార్యక్రమం జరుగలేదు.