హుజూరాబాద్‌టౌన్, మే 7: ప్రభుత్వ రంగ ఇండేన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా నూతనంగా తయారు చేసిన ఐదు, పదికిలోల కాంపోజిట్ సిలిండర్ల జారీకి ఆదేశాలు జారీ చేశారని ఐవోసీఎల్ రామగుండం విక్రయాధికారి అలోక్‌రెడ్డి, హుజూరాబాద్ అంబుజా గ్యాస్ మేనేజింగ్ పార్ట్నర్ పీవీ మదన్మోహన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇండేన్ ఆయిల్ కార్పొరేషన్ మారుతున్న వంటింటి అవసరాలకు అనుగుణంగా కాంపోజిట్ సిలిండర్లను అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు. 2.0 కాంపోజిట్ సిలిండర్‌ను కొన్ని ప్రత్యేక లక్షణాలతో రూపొందించబడిందని తెలిపారు. ఇది తక్కువ బరువు, తకువ ఖర్చుతో లభిస్తుందని వివరించారు. సిలిండర్‌లో ఎంత గ్యాస్ ఉందో తెలుసుకోవచ్చని, లోహపు సిలిండర్ కానందున తుప్పు మరకలు నేలపై కనపడవని వివరించారు.
పేలుడు నుంచి రక్షణకు యూవీ ప్రొటెక్షన్‌తో చుట్టబడిన పైబర్‌తో తయారు చేయబడిందని, హెచ్డీపీఈ ఔట్లెట్ సాకెట్‌తో బిగించబడి ఉంటుందని తెలిపారు. నూతనంగా మారెట్లోకి విడుదలైన 10 కిలోల సిలిండర్ డిపాజిట్ రూ.3,350తోపాటు రీఫిల్ ధర రూ.770.50 ఉంటుందని పేర్కొన్నారు. వివిధ ఇండేన్ ఏజెన్సీల్లో నమోదైన కస్టమర్లు ఇండేన్ కాంపోజిట్ సిలిండర్ కోసం తమ వద్ద ఉన్న 14.2 కిలోల సిలిండర్లు అప్పగించి డిపాజిట్ మినహాయింపు పొంది, రీఫిల్ ధర చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. నూతన కనెక్షన్ పొందేవారు రూ.4,485 డిపాజిట్, రీఫిల్ ఇతర చార్జీలు చెల్లించాలని, స్టౌ కోసం అదనపు చార్జీలు ఎమ్మార్పీ ప్రకారం చెల్లించాలని పేర్కొన్నారు. హైదరాబాద్ జంటనగరాల్లో లభ్యమయ్యే ఈ సిలిండర్లను వివిధ ఇండేన్ గ్యాస్ డీలర్ల ద్వారా అందుబాటులోకి తెచ్చామని అలోక్‌రెడ్డి, పీవీ మదన్మోహన్ వివరించారు.