నేతన్న చౌరస్తా, మే7: పక్క చిత్రంలో పేపర్ చదువుతూ కనిపిస్తున్న పండు ముసలవ్వ పేరు గుడిసె సాలవ్వ. వయస్సు 92 ఏండ్లు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌లో ఉంటున్నది. బాల్యంలో ఆరో తరగతి దాకా చదివింది. ప్రపంచంలో జరుగుతున్న వర్తమాన సంఘటనల గురించి తెలుసుకోవాలన్న కుతూహలంతో చిన్ననాటి నుంచే వార్తా పత్రికలు చదివే అలవాటు చేసుకుంది. అలాగే, టీచర్ కావాలని కలలు కన్నది. కానీ, అప్పుడున్న పరిస్థితుల్లో ఆమె తండ్రి ఆరో తరగతి వరకే చదివించి, వివాహం చేశాడు. తర్వాత కొడుకు జన్మించగా, బాల్యం నుంచే కష్టపడి పెంచి పెద్ద చేసింది. ఎలాగూ తన ఆశయం నెరవేరలేదని, తన కొడుకు ద్వారానైనా నెరవేర్చుకోవాలని అనుకున్నది. పక్కా ప్రణాళికతో చదివించి టీచర్‌గా తీర్చిదిద్దింది. నరాల బలహీనత వల్ల నడవలేని పరిస్థితి ఉన్నప్పటికీ చిన్ననాటి నుంచే అలవాటుగా ఉన్న దినపత్రికలను మాత్రం రోజూ చదువుతుంటుంది. 92 ఏండ్ల వయస్సులోనూ కళ్లజోడు సాయం లేకుండానే చదువుతూ ఆదర్శంగా నిలుస్తున్నది సాలవ్వ. నేడు మతృదినోత్సవం సందర్భంగా కథనం..
అమ్మకే అంకితం..
మా అమ్మ నడవలేకపోయినా బొంతలు కుట్టి ఇంటికి ఆసరాగా ఉండేది. నాన్న హమాలీ పని చేసి నన్ను ఎంఏ, బీఈడీ దాకా చదివించారు. స్కూల్లో కంటే నాకు ఇంటి వద్దే చదువు ఎక్కువగా చెప్పేవారు. మా వాళ్లకు నేను ఒక్కడినే కొడుకును. అమ్మ కోరిక మేరకు నేను కష్టపడి చదివి 1996లో టీచర్ ఉద్యోగం సాధించా. ఇప్పుడు కనగర్తిలో హెచ్ఎంగా పని చేస్తున్న. బాధాకరమైన విషయం ఏంటంటే నాన్న ఐదు నెలల క్రితమే చనిపోయారు. నాకు ఇద్దరు కూతుళ్లు. వాళ్లను కూడా మంచిగా చదివిస్తున్నా. మా ఇల్లు విద్యానిలయంగా భావిస్తా. 2019లో బెస్ట్ టీచర్‌గా జిల్లా స్థాయిలో అవార్డును అందుకున్నా. ఆ పురస్కారాన్ని మా అమ్మకే అంకితం చేశా. ఆమె సంతోషానికి అవధుల్లేవు.
– గుడిసె దేవదాసు, సాలవ్వ కొడుకు