జమ్మికుంట, మే 7 : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పురవీధుల్లో జాగింగ్ డ్రెస్‌తో ఒకరు తెల్లవారుజామున పరుగులు పెడుతున్నారు. అతడి వెనుక మున్సిపల్ సిబ్బంది బైక్‌ల మీద వస్తున్నారు. పరుగులు పెడుతున్న వ్యక్తి అక్కడక్కడ ఆగుతూ.. పారిశుద్ధ్య సిబ్బంది పనితీరును పరిశీలించారు. పట్టణ అభివృద్ధి పనులను పరిశీలిస్తూ ముందుకు సాగారు. ఇలా 16 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తూ.. సిబ్బందిని అలెర్ట్ చేస్తూ.. పట్టణమంతా కలియతిరిగారు. ఆయన జమ్మికుంట కమిషనర్ సమ్మయ్య. ఇటీవల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. శనివారం ఉదయం సిబ్బందిని కలిశారు. రన్నింగ్ చేస్తూ పట్టణమంతా కలియతిరిగారు. అభివృద్ధి పనులపై ఆరా తీశారు. సిబ్బంది విధులను తెలుసుకున్నారు. డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో వాకర్స్‌ను కలిశారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అందరి సహకారంతోనే మున్సిపల్ సుందరంగా ఏర్పాటు సాధ్యమన్నారు. ప్రతిరోజూ వాకింగ్‌తోనే సిబ్బంది, ప్రజలను కలుస్తానని చెప్పారు. సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అలాగే నేరుగా కార్యాలయంలోనూ సంప్రదించవచ్చని సూచించారు. అందరికీ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ఆయన వెంట మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులున్నారు.