వీణవంక, మే 6: మండలంలోని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు ముందుకు వచ్చి నేరాల నియంత్రణలో భాగస్వాములవ్వాలని సీపీ సత్యనారాయణ పిలుపు నిచ్చారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌తో పాటు ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన 91 సీసీ కెమెరాలను శుక్రవారం ఆయన ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్‌రెడ్డి కృషితో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గాయని పేర్కొన్నారు. మండల ప్రజలు చైతన్యవంతులని, మండలంలో ఇప్పటికే 20 గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, మిగతా 6 గ్రామాల్లో కూడా త్వరలోనే ఏర్పాటు చేసి జిల్లాలోనే ఆదర్శంగా నిలువాలని ఆకాంక్షించారు. ఆలయాలు, మసీదులు, చర్చిల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం హర్షణీయమని, మిగతా చోట్ల కూడా సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మండలంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలను ఈ సందర్భంగా సీపీ అభినందించారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, క్రీడాకారులకు వాలీబాల్ కిట్లు అందజేశారు. హుజూరాబాద్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, జమ్మికుంట రూరల్ సీఐ సురేశ్, టౌన్ సీఐ రాంచందర్, ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ మాడ వనమాల-సాధవరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ మావురపు విజయభాస్కర్‌రెడ్డి, సర్పంచ్ నీల కుమారస్వామి, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ డా.వేణుగోపాల్‌రెడ్డి, ఎస్ఐ శేఖర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.