కార్పొరేషన్, మే 6 : కరీంనగర్ నగరపాలక సంస్థను అన్ని మున్సిపాలిటీలు ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారక రామారావు సూచించారు. హైదరాబాద్‌లో రెండో రోజు ఆసీ సంస్థ ఆధ్వర్యంలో ‘ఇన్నోవేషన్ న్యూ టెక్నాలజీ ఇన్ వాటర్, శానిటేషన్ హైజెనిక్ అంశం’పై జరిగిన శిఖరాగ్ర సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై సదస్సు ద్వారా వివిధ సంస్థలు వివరించిన టెక్నాలజీ బేస్ అంశాలపై మంత్రి కేటీఆర్ సలహాలు, సూచనలు చేశారు. సదస్సులో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించి పరిశీలించారు. ప్రజలకు అత్యాధునిక టెక్నాలజీ ద్వారా అందించే నూతన ఆవిషరణలపై వివిధ సంస్థల ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, కమిషనర్ సేవా ఇస్లావత్ ఈ సమావేశంలో పాల్గొనగా, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల ‘సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్’లో నగదు బహుమతి పొందిన విషయాన్ని పలు పుర, నగరపాలక సంస్థల మేయర్లు, చైర్మన్లకు మంత్రి వివరించారు. ఇలాంటి టెక్నాలజీ పద్ధతులను అవలంబించి మిగితా మున్సిపాలిటీలు మంచి గుర్తింపు సాధించాలన్నారు.
నగదు బహుమతి పొందిన మేయర్‌ను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. నూతన ఆవిషరణల ద్వారా కరీంనగర్ నగర ప్రజలకు ఇంకా మెరుగైన సేవలను అందించి గొప్ప గొప్ప విజయాలతో మరిన్ని అవార్డులను సొంతం చేసుకోవాలని ప్రోత్సహించారు. నూతన ఆవిషరణల ద్వారా మున్సిపాలిటీల్లో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, చైర్పర్సన్లకు ఆదేశాలు జారీ చేశారు. మంచి నీటి సరఫరా, పారిశుధ్యం, ప్లాస్టిక్ నివారణ, సాలిడ్ వేస్ట్ మెనేజ్మెంట్ వంటి ప్రక్రియలో టెక్నాలజీని వినియోగించి ప్రజల జీవణ ప్రమాణాల రేటును పెంచాలని సూచించారు.