సిరిసిల్ల/ఎల్లారెడ్డిపేట, మే 3: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ పర్యటన వివరాలను విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు సిద్దిపేటలో పోలీస్ కన్వెన్షన్ హాల్లో జరిగే అంకిరెడ్డిపల్లి సర్పంచ్ గోపాల్‌రెడ్డి కుమారుని వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి ఉదయం 11.30 గంటలకు తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల ప్రభుత్వ పాఠశాలలో మన ఉరు-మన బడిలో భాగంగా దాత సహాయంతో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 12గంటలకు సిరిసిల్లలోని సెస్ కార్యాలయంలో సెస్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ పదవీ బాధ్యతల స్వీకరణకు హాజరు కానున్నారు. అనంతరం 12.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్‌లో ఎల్లమ్మ సిద్ధ్దోగం వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటలకు పదిరకు చెందిన దళితబంధు లబ్ధిదారులు హరిదాస్‌నగర్ శివారులో ఏర్పాటు చేయనున్న పెట్రోల్ బంక్ ఏర్పాటుకు భూమిపూజ చేయనున్నారు. మధ్యా హ్నం 1.30 గంటలకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్వాగత తోరణాన్ని ప్రారంభించిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పదిరకు చెందిన దళితబంధు లబ్ధిదారులు అక్కపల్లి స్టేజీ వద్ద నిర్మించుకోనున్న రైస్‌మిల్లుకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎల్లారెడ్డిపేట సాయిమణికంఠ గార్డెన్లో జరుగనున్న రాజన్నపేట సర్పంచ్ శంకర్ సోదరుని వివాహవేడుకకు హజరుకానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో మన ఉరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
పాఠశాల పునరుద్ధరణ పనులు, దళిత బంధు యూనిట్లకు శంకుస్థాపన
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా బండలింగంపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో చేపట్టనున్న పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే పదిరకు చెందిన సుదామల్ల రాజేశ్వరి, సుదామల్ల విజయ్‌కుమార్, డప్పుల లింగయ్య కలిసి అక్కపల్లి శివారులో ఏర్పాటు చేసే 4టన్నుల సామర్థ్యం గల రా రైస్‌మిల్లు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. పదిరకు చెందిన లబ్ధిదారులు తెడ్డు పద్మ, తెడ్డు ఎల్లవ్వ, తెడ్డు దేవేంద్ర, తెడ్డు ప్రమీల, పత్రి రాజవ్వ, జడల ఎల్లవ్వ, రుద్రారపు సతీశ్, తెడ్డు బాల్‌లక్ష్మి, తెడ్డు లక్ష్మి, కలిసి హరిదాస్‌నగర్‌లో పెద్దమ్మ దేవాలయం ఎదుట 22 గుంటల స్థలంలో పెట్రోలు బంకును ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నారు. పెట్రోలు బంకు నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేయనుండగా వారంతా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.