జగిత్యాల కలెక్టరేట్, మే 2: కండ్లముందరే పోలీసు కొలువు.. పక్కా ప్రణాళికతో చదివితేనే విజయం సులువు. మరి ఎలా ప్రిపేరవ్వాలి.. ఫిజికల్ టెస్ట్‌కు అవసరమైన దేహదారుఢ్యాన్ని ఎలా మెరుగు పరుచుకోవాలి..? ప్రిలిమ్స్ అధిగమించేందుకు ఏం చేయాలి..? వీటన్నింటికీ పోలీసుశాఖ చక్కటి పరిష్కారం చూపుతున్నది. డీజీపీ ఆదేశాలతో జిల్లా కేంద్రాల్లో నిష్ణాతులైన బోధకులతో ఉచిత శిక్షణ అందిస్తున్నది. ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్టులు ఐదు నుంచి మూడుకు కుదించడంతో రాత పరీక్ష, ప్రిలిమినరీ పరీక్షలే లక్ష్యంగా ట్రైనింగ్ ఇస్తున్నది. రాత పరీక్ష, దేహదారుఢ్యానికి సంబంధించి మెళకువలు నేర్పుతూనే, గతంలో ఎస్ఐ జాబ్ కొట్టినవారితో తర్ఫీదు ఇస్తుండగా, కొలువే లక్ష్యంగా యువత తీవ్రంగా శ్రమిస్తున్నది.
పోలీసు ఉద్యోగ సాధనకు కఠోర శ్రమ, సరైన దిశానిర్దేశం అవసరం. కోచింగ్ తీసుకుంటేనే విజయం సులువవుతుంది. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి శిక్షణ తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నవారికి జిల్లా కేంద్రాల్లో పోలీసుశాఖ ఇస్తున్న ఫ్రీ ట్రైనింగ్ ఎంతో వరంగా మారుతున్నది. పోలీస్ ఉద్యోగం సాధించాలంటే ఏం చేయాలి..? అతి ముఖ్యమైన శారీరక దారుఢ్యాన్ని ఎలా మెరుగుపర్చుకోవాలి..? ప్రిలిమ్స్ పరీక్ష అధిగమించేందుకు ఎలా సన్నద్ధమవ్వాలి. ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్టును అధిగమించాలంటే చేయాల్సిన సాధన తీరుపై శిక్షణ ఇస్తుండగా, ఉద్యోగార్థుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
నిఫుణులతో ప్రిలిమినరీ మెయిన్స్‌కు శిక్షణ..
కొలువుల భర్తీలో తొలుత నిర్వహించే ప్రిలిమినరీ రిటన్ టెస్ట్‌పైనా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. శిక్షణ కేంద్రాల్లో దీనిపైనే పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. 2020 బ్యాచ్‌లో ఎస్ఐలుగా ఉద్యోగాలు సాధించిన వారి అనుభవాలు, ప్రిపరేషన్ అయిన తీరు, రెఫరెన్స్ బుక్స్ వంటి అంశాలను సైతం తెలియపరుస్తూ అభ్యర్థులను ఉత్తేజపరుస్తున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో నెగెటివ్ స్కోరింగ్ ఉండడంతో అభ్యర్థులు మరింత జాగ్రత్తగా ఉండాలని శిక్షణలో పేర్కొంటున్నారు. కాగా, పోలీసు శాఖ ఫ్రీ ట్రైనింగ్‌పై ఉద్యోగార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైసా ఖర్చులేకుండా ప్రైవేటు సెంటర్లకు దీటుగా శిక్షణ ఇస్తుండడంతో కృతజ్ఞతలు చెబుతున్నారు.
జిల్లా కేంద్రాల్లో ఉచిత కోచింగ్ సెంటర్..
పోలీస్ నోటిఫికేషన్ వెలువడకముందే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. డీజీపీ ఆదేశాల మేరకు ఆయా జిల్లాల పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు ఉచిత ట్రైనింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలు విడుదల చేయగా, ఆయా జిల్లాలో యువతీ యువకుల నుంచి భారీ స్పందన వచ్చింది. వేలాదిగా దరఖాస్తు చేసుకోగా, స్క్రీనింగ్ టెస్టు ద్వారా అర్హులను గుర్తించి జిల్లా కేంద్రాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈవెంట్స్, శారీరక దారుఢ్య పరీక్షలకు ఇన్స్పెక్టర్, ఎస్ఐ స్థాయి అధికారుల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తున్నారు. ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్టు/ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులో నిర్వహించనున్న 1600 మీటర్ల పరుగుపందెం(పురుషులు), 800మీటర్ల పరుగుపందెం(మహిళలు), లాంగ్ జంప్, షార్ట్‌పుట్ వంటి ఈవెంట్స్‌ను ప్రాక్టీస్ చేయిస్తున్నారు. ఈవెంట్స్‌లో సులభంగా గట్టెక్కేందుకు వివిధ రకాల కసరత్తు చేయిస్తూ ఫిట్నెస్ను మెరుగుపరుస్తున్నారు. ఇంకా ప్రిలిమినరీ పరీక్ష సిలబస్ ఆధారంగా ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి సన్నద్ధం చేయిస్తున్నారు. కా జగిత్యాల జిల్లాకు సంబంధించి 260 మందికి జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో ఈవెంట్స్, ఎస్వీఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో ప్రిలిమినరీ టెస్ట్ కోసం శిక్షణ ఇస్తున్నారు.
మారిన ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్టు విధానం..
పోలీస్ కొలువుల భర్తీలో భాగంగా ఈ సారి ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌లో కొన్ని మార్పులు చేశారు. గతంలో ఐదు అంశాల్లో జరిగే ఈ పరీక్ష విధానం మూడు అంశాలకే పరిమితం చేశారు. పురుషులకు 1600మీటర్ల పరుగుపందాన్ని 7.15 నిమిషాల్లో, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు 9.30నిమిషాలు కేటాయించారు. మహిళలకు 800మీటర్ల పరుగు పందాన్ని 5.20 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. నిర్దేశిత సమయం కంటే తక్కువ సమయంలో పరుగును పూర్తి చేసిన అభ్యర్థులకు మెరిట్ మార్కులు కుడా ఇవ్వనున్నారు. లాంగ్‌జంప్, షార్ట్‌పుట్‌లలో కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది. లాంగ్‌జంప్‌లో పురుషులు 4మీటర్లు, ఎక్స్ సర్వీస్‌మెన్ 3.50మీటర్లు, మహిళలు 2.50మీటర్లు దూరం జంప్ చేయాల్సి ఉంటుంది. ఇంకా 7.2కిలోల బరువు గల షార్ట్‌పుట్‌ను పురుషులు 6మీటర్లు, 4కిలోల బరువు గల షార్ట్‌పుట్‌ను మహిళలు 4మీటర్లు విసిరితే క్వాలిఫై అవుతారు. సివిల్, ఏఆర్ విభాగాల అభ్యర్థులకు ఇవే నిబంధనలు వర్తిస్తాయి. ఉద్యోగానికి ఈ మూడు తప్పనిసరి కావడంతో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు.
అభ్యర్థులకు ఎమ్మెల్యే సంజయ్ రాగి జావ
పోలీసు కొలువే లక్ష్యంగా అభ్యర్థులు మైదానాల్లో ముమ్మర కసరత్తు చేస్తుండగా, వారిలో సత్తువ నింపేందుకు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తోడ్పాటునందిస్తున్నారు. మైదానంలో అభ్యర్థుల కసరత్తు ముగిసిన తర్వాత రాగి జావ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించగా, నిరంతరాయంగా కొనసాగుతున్నది. 60రోజుల పాటు జావ అందించేందుకు రూ.1.20లక్షలను సైతం ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్‌ను ఆదర్శంగా తీసుకున్న ఎస్కేఎన్ఆర్ డిగ్రీకళాశాల మైదానం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పండ్లు, పలువురు ఎనర్జీ డ్రింక్స్ అందిస్తున్నారు.
యువతకు గొప్ప అవకాశం..
పోలీసుశాఖ ఉచిత శిక్షణ యువతకు వరంలా ఉంది. డీజీపీ ఆదేశాల మేరకు ఎస్పీ సింధూశర్మ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో శిక్షణ ఇస్తున్నాం. ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ కోసం అభ్యర్థులు చాలా బాగా రెస్పాన్స్ అవుతున్నారు. 2003లో డిగ్రీ పూర్తయిన తర్వాత సీఆర్పీఎఫ్లో జవానుగా చేరా. 11 నెలల శిక్షణ అనంతరం కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో రెండేళ్లు పనిచేశా. ఆ తర్వాత పార్లమెంట్ సెక్యూరిటీ వింగ్‌లో సైతం పనిచేశా. కుటుంబానికి దూరంగా ఉండడంతో వారితో కలిసి ఉండాలనే 2011 పోలీస్ రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించి కరీంనగర్లో స్పెషల్ పార్టీ, మేడిపెల్లి, మల్యాల పోలీస్ స్టేషన్లో రైటర్‌గా విధులు నిర్వహించా.
అయినప్పటికీ ఏదో తెలియని వెలితి ఉండేది. 2013 సీఐఎస్ఎఫ్లో ఎస్ఐ ఉద్యోగం వచ్చినప్పటికీ వెళ్లలేదు. ఇంతలోనే 2018లో ఎస్ఐ నోటిఫికేషన్ వెలువడడంతో సీరియస్‌గా ప్రిపేరయ్యా. ఇండియన్ హిస్టరీ(సీనయ్య), పొలిటికల్ సైన్స్(ప్రభాకర్‌రెడ్డి), తెలంగాణ హిస్టరీ(ప్రకాశ్), రీజినింగ్ అండ్ ఆర్థమెటిక్(ఆర్ఎస్ అగర్వాల్) పుస్తకాలతో రిటన్ టెస్ట్‌కు ప్రిపేరయ్యా. ఆర్ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికయ్యా. నమస్తే తెలంగాణ నిపుణలో వచ్చే సబ్జెక్ట్ కంటెంట్, కరంట్ ఎఫైర్స్ ఎంతో ఉపయోపడ్డాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 18నెలల శిక్షణ పూర్తి చేసుకొని జగిత్యాల హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్నా. మూడు ఉద్యోగాల సాధనలో ఎదురైన సమస్యలు, వాటిని ఎదుర్కొన్న తీరును అభ్యర్థులకు వివరిస్తూ శిక్షణ ఇస్తున్నా.
– నల్లగొండ కృష్ణగౌడ్, ఆర్ఎస్ఐ.
మహిళలవైపు నిలబడతా..
మహిళలు, అమ్మాయిలకు సహాయపడాలనే ఉద్దేశంతోనే పోలీస్ ఉద్యోగంలోకి రావాల నిశ్చయించుకున్న. ఖాకీ యూనిఫాం చూస్తేనే ఎక్కడాలేని కాన్ఫిడెన్స్ వచ్చినట్లపిస్తది. అదే యూనిఫాం వేసుకుంటే కాన్ఫిడెన్స్ రెట్టింపైతది. ప్రజలకు, తోటి మహిళలకు సేవ చేయవచ్చనే పోలీస్ ఉద్యోగంలో చేరాలని ప్రిపేరవుతున్న. ప్రైవేట్ సెంటర్లలో కోచింగ్ తీసుకుందామనుకున్న. కానీ ఫీజు భారీగా ఉండడంతో వెనక్కి తగ్గా. కానీ పైసా ఖర్చు లేకుండా కోచింగ్ ఇస్తున్న జగిత్యాల పోలీసులకు కృతజ్ఞతలు. మాలాంటి మధ్య తరగతి వారికి ఫ్రీ కోచింగ్ వరంలాంటిది.
– చింత రోజ, జగిత్యాల.