సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటకు చెందిన రైతు గోపిడి ప్రభాకర్‌రెడ్డికి ఐదేండ్ల క్రితం వరకు తెలిసింది వరి, పత్తి సాగే. సీజన్లో ఎకరాకు 60 వేల దాకా పెట్టుబడి పెట్టినా.. అహర్నిశలు శ్రమించినా 20 వేల నుంచి 30 వేలకు మించి మిగిలేవి కావు. కానీ, ఐదేండ్ల క్రితం యూట్యూబ్‌లో వచ్చిన ఓ వీడియో.. సరికొత్తగా అడుగులు వేయించింది. టిష్యూ కల్చర్ అరటి సాగుతో లాభాల బాట పట్టేలా చేసింది. నాలుగెకరాల్లో సాగు చేస్తుండగా, ఏడాదికి 2.50 లక్షల దాకా ఆదాయం వస్తున్నది. వరితో పోలిస్తే మూడు రెట్లు అధిక ఆదాయముంటుండగా, పెద్దపల్లి జిల్లా రైతాంగం ఆసక్తి చూపుతున్నది. వందకుపైగా ఎకరాల్లో సాగు చేస్తూ, మంచి లాభాలు తీస్తున్నది.
పెద్దపల్లి, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : రేగడి మద్దికుంటకు చెందిన రైతు గోపిడి ప్రభాకర్‌రెడ్డికి గ్రామంలో ఎనిమిదెకరాల భూమి ఉన్నది. కొన్నేండ్ల దాకా సంప్రదాయ పంట లు వేసిన ఆయన, ఐదేళ్లుగా నాలుగెకరాల్లో అరటి పండించ డం మొదలు పెట్టాడు. టిష్యూ కల్చర్ ద్వారా సాగు చేస్తూ అ ధిక లాభాలు సాధిస్తున్నాడు. మొక్కలు, ఎరువులకు, డ్రిప్‌పై ప్రభుత్వం నుంచి 90 శాతం సబ్సిడీ తీసుకొని సాగులో రాణిస్తున్నాడు. ఈ పంటకాలం రెండేళ్లు. తొలి ఏడాది ఎకరాకు 60 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో అరటి కిలో ధర 10 పలుకుతుండగా, ఏడాదికి 2 లక్షల నికర లాభాన్ని ఆర్జిస్తున్నాడు. తొలి ఏడాది 30 ట న్నుల దిగుబడి రాగా, ప్రస్తుతం 25 నుంచి 28 టన్నులు వ చ్చింది. కాగా, రైతు తన పంటను మార్కెట్‌కు వెళ్లి విక్రయించాల్సిన అవసరం లేకుండా విక్రేతలే చేను వద్దకు వ చ్చి కొనుగోలు చేస్తుండడం విశేషం. సాగు లాభసాటిగా ఉండడంతో ప్రభాకర్‌రెడ్డి మరో మూడెకరాల్లో అరటి సాగుకు శ్రీకారం చుట్టాడు. అంతర పంటగా వాటర్ మిలన్‌ను పెట్టి అదనపు ఆదాయాన్ని పొందుతున్నాడు.
సుధీర్ఘకాలంగా వరి, పత్తిని నమ్ముకొని.. లాభం వస్తే తీసుకొని లేదంటే ఏటా లాగోడికి తండ్లాడిన రేగడిమద్దికుంట రైతు దశ తిరిగింది. ఒక రోజు వచ్చిన ఆలోచన అతని జీవితాన్నే మార్చి వేసింది. కొన్నేండ్ల దాకా సంప్రదాయ పంటలు వేసి తీవ్రంగా నష్టపోయిన కర్షకుడు గోపిడి ప్రభాకర్‌రెడ్డి.. ఉద్యానవన పంటల సాగు బాట పట్టి లాభాల పంట తీస్తున్నాడు. వరిని వదిలి ఐదేండ్లుగా అరటి సేద్యం చేస్తూ ఎకరానికి కేవలం 60వేల పెట్టుబడి పెట్టి 2.50 లక్షల ఆదాయం పొందుతున్నాడు.
పెద్దపల్లి జిల్లాలో 110 ఎకరాల్లో తోటలు..
అధిక దిగుబడులు, లాభాలు ఇచ్చే పంట కావడంతో జిల్లాలోని పలువురు రైతులు అరటి సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఇటీవలి కాలంలో పెద్ద సంఖ్యలో రైతులు సాగు చేస్తున్నారు. ముత్తారం మండలంలో 20 ఎకరాలు, అంతర్గాంలో 15, పాలకుర్తిలో 20, జూలపల్లిలో 27, సుల్తానాబాద్‌లో 5, ధర్మారంలో 25 ఎకరాల్లో.. అంటే మొత్తం 110ఎకరాల్లో అరటిని సాగు చేస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు.
టిష్యూ కల్చర్‌తో లాభాలు..
సాధారణంగా అరటికి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే శక్తి తక్కువ. దీంతో పంట చివరిదాకా ఉండదు. అందుకు ప్రత్యామ్నాయంగానే టిష్యూకల్చర్ విధానాన్ని తీసుకువచ్చారు. ఇది సాధారణ రకం హెక్టారుకు 2,700 గెలలు ఇస్తే.. టిష్యూ కల్చర్ 3,300 అందిస్తుంది. అంటే 600 గెలలు అధికం. తెగుళ్లు చీడపీడలు తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. అధిక దిగుబడి ఇవ్వడంతోపాటు నాణ్యమైన కాయల్ని ఇస్తాయి. పంటకాలం కూడా తక్కువగా ఉంటుంది. కేవలం 90 రోజుల్లోనే కాతకు వస్తాయి. నాటిన మొక్కల్లో 95 శాతం బతుకుతాయి. మొక్కల పెరుగుదల, దిగుబడి సమంగా ఉంటుంది.
మంచి లాభాలు
అరటితో మంచి లాభాలు ఉంటాయి. వరి, పత్తి, మక్క పంటలకు ప్రత్యామ్నాయంగా సాగు చేసి అధిక దిగుబడి పొందవచ్చు. ఎక్కడా సాగులో కానీ యాజమాన్యంలో కానీ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. సస్యరక్షణ చర్యలు కూడా సులువే. ఉద్యాన వన పంటలను ప్రభుత్వం కూడా చాలా ప్రోత్సహిస్తున్నది. ఇప్పుడు సాగు చేస్తున్న రైతులంతా జిల్లా రైతులకు రోల్ మాడల్‌గా నిలుస్తున్నారు.
– ఏ జ్యోతి, మండల ఉద్యాన అధికారి (సుల్తానాబాద్)