కొత్తపల్లి, ఏప్రిల్ 30 :దంచికొడుతున్న భానుడు మూడు రోజులుగా తీవ్రంగరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరువ ఉదయం తొమ్మిది గంటలకే సుర్రుసుర్రు మధ్యాహ్నం కల్లా మంట సాయంత్రం ఆరైనా తగ్గని దగడు పొద్దంతా వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి బయటికి రావాలంటేనే భయం మున్ముందు మరింత తీవ్రత పెరిగే ముప్పు
వామ్మో ఏం ఎండ ఇది.
మూడు రోజుల సంది దంచుతున్నది. పొద్దున ఎనిమిదిన్నర గంటలకే మంట పుట్టిస్తున్నది. మధ్యాహ్నం కల్లా మాడు పగులగొడుతున్నది. సాయంత్రం ఆరు దాటినా దగడు తగ్గుత లేదు. పొద్దంతా ఒకటే వేడి. ఇంట్లో ఉన్నా.. బయట ఉన్నా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది.
గరిష్ఠ ఉష్ణోగ్రతలు
46 డిగ్రీలకు చేరువ కాగా, జనం ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉన్నది. మున్ముందు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదముండగా, జాగ్రత్తగా ఉండాలని యంత్రాంగం హెచ్చరిస్తున్నది.
రోజురో జుకూ ఎండలు ముదురుతున్నాయి. గత పది రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటుతున్నాయి. రోజంతా భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో సాయంత్రం 6 గంటల వరకు వేడి గాలులు వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 25 డిగ్రీలకు పైగానే నమోదవుతుండడంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రిళ్లు చల్లగా, మధ్యాహ్నం ఎండలు తీవ్రంగా ఉంటే, అలాంటి వాతావరణంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
మరింతగా పెరిగే ముప్పు..
ఏప్రిల్లోనే 46 డిగ్రీలకు చేరిన ఎండలు ఈ నెలలో ఎలా ఉంటాయోనన్న భయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. వచ్చే వారంలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల నుంచి 46 డిగ్రీల మేరకు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లినా ఎండ వేడి నుంచి తట్టుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మే నెలలో వడగాల్పులు ఎక్కువగా వీచే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.
రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు..
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ఎండపల్లి, మల్లాపూర్ మండలం రాఘవపేట, బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామాల్లో శనివారం రికార్డు స్థాయిలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు. కూలీలు ఉదయం 10 గంటల వరకే పనులు ముగించుకుంటున్నారు.
ముదురుతున్న ఎండలు..
ఏప్రిల్ నెలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండగా, ఈ నెలలో మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఓ వైపు గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతోపాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుండడంతో నగరంలోని ప్రధాన రహదారులన్నీ మధ్యాహ్నం నిర్మానుష్యంగా మారుతున్నాయి. అనునిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు వెలవెలబోతున్నాయి.