కార్పొరేషన్, ఏప్రిల్ 30: రాష్ట్రంలోనే రోజూ మంచినీటి సరఫరా చేస్తున్న ఏకైక నగరం కరీంనగర్ అని, సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూడాలని మేయర్ వై సునీల్‌రావు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో మేయర్ అధ్యక్షతన శనివారం బల్దియా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎజెండాలో చేర్చిన 15 అంశాలకు సభ ఆమోదం తెలిపింది. కాగా, నగరంలో మంచినీటి సరఫరా విషయమై వాడివేడిగా చర్చ సాగింది. పలువురు కార్పొరేటర్లు తమ డివిజన్లలో మంచినీటి సరఫరాలో ఇబ్బందులు వస్తున్నాయని సభ దృష్టికి తీసుకువచ్చారు. అయితే, ఎల్ఎండీలో నీటి మట్టం తగ్గడంతో నగరంలో మంచినీటి సరఫరా విషయంలో సమస్యలు వస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. అయినా కూడా అన్ని డివిజన్లలో రోజూ మంచినీటి సరఫరా చేస్తున్నామని మేయర్ వై సునీల్‌రావు తెలిపారు.
వారం రోజుల్లో సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, పలువురు కార్పొరేటర్లు రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్, వీధి కుకలు, పందుల బెడద, భవన నిర్మాణ అనుమతులు, ఇంటి నంబర్లు, మ్యుటేషన్, తదితర సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా మ్యుటేషన్, ఇంటి నంబర్ల కేటాయింపు, అడ్రస్ మార్పు విషయంలో రెవెన్యూ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు సభ్యులు విన్నవించగా, స్పందించిన మేయర్ వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ వై సునీల్‌రావు మాట్లాడుతూ, ఏడాదిగా నగరంలో రోజూ మంచినీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
మానేరు డ్యాంలో కొంత నీటి మట్టం తగ్గడంతో మంచినీటి సరఫరా ప్రెషర్లో ఇబ్బందులు తలెత్తాయన్నారు. మధ్య మానేరు నుంచి ఎల్ఎండీకి నీటిని విడుదల చేయించాలని ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మధ్య మానేరులోనూ సాంకేతిక సమస్యలతో నీటిని విడుదల చేసే విషయంలో సమస్యలు వస్తున్నాయన్నారు. ఈ సమస్య కూడా వారంలోగా పరిష్కారం అవుతుందన్నారు. నగర వ్యాప్తంగా ప్రతి డివిజన్‌కు కొంత సమయం అటు ఇటుగా అయినా ప్రజలకు నీరందిస్తున్నామని తెలిపారు. కొన్ని డివిజన్లలో స్మార్ట్‌సిటీ, ఇతర అభివృద్ధి పనులతో పైపులు పగిలి సరఫరాలో సమస్యలు వస్తున్నాయని, త్వరలోనే పరిషరిస్తామని స్పష్టం చేశారు. వేసవిలో మంచినీటి సరఫరాలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు, ప్రజల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిషరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తీగలగుట్టపల్లి, సీతారాంపూర్, ఆరెపల్లి, రేకుర్తి ప్రాంతంలో పైపులైన్ పనులు కొంత మేర పూర్తయ్యాయని, మిగతా పనులు త్వరగా పూర్తి చేసి రోజూ నీరందిస్తామని హామీ ఇచ్చారు. పైపులైన్లు పగిలిన కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. నగరంలో అభివృద్ధి పనులు ప్రారంభించని కాంట్రాక్టర్ల వివరలు డివిజన్ల వారీగా లిస్టు తయారు చేసి అందించాలని అధికారులను ఆదేశించారు.
పనులు ప్రారంభించని కాంట్రాక్టర్ అభిప్రాయం సేకరించి అవసరమైతే నోటీసులు జారీ చేయాలన్నారు. కాంట్రాక్ట్ రద్దు చేసి టెండర్ ప్రక్రియ నిర్వహించి, పనులను మరో కాంట్రాక్టర్‌కు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. నగరంలో వీధి కుకల సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తామని వెల్లడించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, డిప్యూటీ కమిషనర్ త్రియంభకేశ్వర్, పాలకవర్గ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.