కమాన్‌పూర్, ఏప్రిల్ 30: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కానీ గిట్టని వారు కొందరు ఒక వర్గానికే పరిమితం చేసేందుకు కుట్రలు చేశారని విమర్శించారు. ఆయన అన్నివర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. కమాన్‌పూర్ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్‌తో కలిసి మంత్రి ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కమాన్‌పూర్‌లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దేశంలో ఆర్థికంగా వెనుకబడ్డ వారి అభివృద్ధిని కాంక్షించే అంబేద్కర్ రిజర్వేషన్లను రాజ్యాంగంలో పొందుపరిచారని చెప్పారు.
ఆ మహోన్నతుడి స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, అణగారిన దళితుల బతుకుల్లో వెలుగులు నింపేందుకే దళితబంధు పథకానికి అంకురార్పణ చేశారని పేర్కొన్నారు. ఈ స్కీం ద్వారా ఈ ఏడాది 2.40 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలతో పరిశ్రమలు మూతపడి యువత ఉపాధి అవకాశాలను కోల్పోతున్నదన్నారు. మతస్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పారు. దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ గొప్పదనాన్ని ప్రపంచవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. యువత అంబేద్కర్ స్ఫూర్తితో అణగారిన వర్గాల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.
జడ్పీ చైర్మన్ మాట్లాడారు. అంబేద్కర్ జీవితచరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని పేర్కొన్నారు. మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు తనవంతు సహకరిస్తానని చెప్పారు. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహావిష్కరణకు విచ్చేసిన మంత్రి, జడ్పీ చైర్మన్‌కు టీఆర్ఎస్, దళిత సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల కాంతం, సమతా సైనిక్ దళ్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రెంజర్ల రాజేశ్, సర్పంచ్ నీలం సరిత, పీఏసీఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్‌రావు, ఎంపీటీసీలు కోలేటి చంద్రశేఖర్, బోనాల వెంకటస్వామి, దళిత నేతలు మామిడిపెల్లి బాపయ్య, మాజీ ఎంపీపీలు మల్యాల రాంచంద్రంగౌడ్, కోలేటి మారుతి, పూలే, అంబేద్కర్ విగ్రహాల కమిటీ మంథని నియోజకవర్గ కన్వీనర్ తగరం శంకర్‌లాల్, అంబేద్కర్ విగ్రహ కమిటీ చైర్మన్ కుక్క చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి పొనగంటి రాజనర్సు, కోశాధికారి గుర్రం లక్ష్మీమల్లు కమిటీ సభ్యులు, సర్పంచులు బొల్లపెల్లి శంకర్‌గౌడ్, తాటికొండ శంకర్, కట్కం రవీందర్, కొండ వెంకటేశ్, నాయకులు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, ఇనగంటి రామారావు, పూదరి సత్యనారాయణ, శంకేసి రవీందర్ పాల్గొన్నారు.