రామడుగు, ఏప్రిల్ 30: దళితబంధు పథకం దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని పందికుంటపల్లిలో శనివారం ఏర్పాటు చేసిన దళితబంధు లబ్ధిదారుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దళితుల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. నవశకానికి మరో అంబేద్కర్‌లా దళితుల నుదిటి రాతను మార్చే బ్రహ్మ దేవుడయ్యారాన్నరు. గతంలో దళితులు అంటరాని వారుగానే మిగిలిపోయారన్నారు. నేడు ప్రతి దళితుడు ఆత్మాభిమానంతో తల ఎత్తుకొని జీవించేలా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తోందన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
ఉద్యమాల పురిటిగడ్డగా పేరొందిన కరీంనగర్ జిల్లా నుంచే సింహ గర్జన అయినా, సంక్షేమ పథకమైనా పురుడు పోసుకుంటుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో దళిత సాధికారత తెచ్చిన మహోన్నతుడు మన సీఎం కేసీఆర్ అని కొనియాడారు. దళితుల ఆర్థిక ఎదుగుదలకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు దళితులంతా రుణపడి ఉంటారన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి దళిత బిడ్డలు విద్యావేత్తలుగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. లక్షా 25 వేలను ఖర్చు చేస్తున్నదన్నారు. దళితబంధు పథకం డబ్బులు లబ్ధిదారుల ఖాతాలో నేరుగా జమవుతాయన్నారు. దళితుల ఎదుగుదలను చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు దళితబంధు పథకం కేవలం ఎన్నికల స్టంట్‌గానే విష ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యకం చేశారు.
అర్హులందరికీ దళితబంధు వర్తింపజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కలిగేటి కవిత, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, సర్పంచ్ మొగుళ్ల ఎల్లయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు కలిగేటి లక్ష్మణ్, సైండ్ల కరుణాకర్, రాళ్ల లక్ష్మణ్, జూపాక మునీందర్, వూకంటి చంద్రారెడ్డి, గునుకొండ అశోక్, పెంటి శంకర్, పొర్తి సత్యనారాయణ, పందికుంటపల్లి, కుర్మపల్లి టీఆర్ఎస్ గ్రామాధ్యక్షులు మొగిలిపాలెం నరేశ్, చిమ్మల్ల శంకర్, ఆరపెల్లి ప్రశాంత్, బూత్కూరి సురేశ్, కటుకం రాజిరెడ్డి, కొడిమ్యాల రాజేశం, కొత్తూరి బాబు, నరేశ్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.