హుజూరాబాద్‌టౌన్/ జమ్మికుంట, ఏప్రిల్ 30: స్వరాష్ట్రంలో ముస్లింలకు సముచిత గౌరవం దక్కిందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం రాత్రి హుజూరాబాద్ పట్టణంలోని సాయిరూప గార్డెన్లో ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు నిర్వహించారు. అలాగే జమ్మికుంట పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్లో తహసీల్దార్ రాజారెడ్డి ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. రంజాన్ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చే తోఫా(గిఫ్ట్‌లను)లను ముస్లింలకు అందజేసి, వారితో కలిసి ఇఫ్తార్ విందు ఆరగించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన బండ శ్రీనివాస్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడాలేని విధంగా ముస్లింలకు దుస్తులను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ఒక్కటేనని స్పష్టం చేశారు.
ముస్లిం యువతకు ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న సీఎం కేసీఆర్, మసీద్, ఇద్గాల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసిన విషయాలను గుర్తు చేశారు. కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, తహసీల్దార్ ఎల్ రామ్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, సింగిల్ విండో అధ్యక్షుడు ఎడవెల్లి కొండల్‌రెడ్డి, మత పెద్దలు ఫహిమ్, జలాలొద్దీన అక్బర్, కౌన్సిలర్లు తాళ్లపెల్లి శ్రీనివాస్, మక్కపెల్లి కుమార్‌యాదవ్, ఎంపీటీసీ రాధమ్మ, సర్పంచ్ గూడూరి ప్రతాప్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కుమారస్వామి, ఎండీ ఇమ్రాన్, గఫార్, ఖలీద్హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంటలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, ఎంపీపీ దొడ్డె మమత, డీటీ సమ్మయ్య, ఆర్ఐలు శేఖర్, తిరుపతి, కౌన్సిలర్లు, నాయకులు, ముస్లింలు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.