కరీంనగర్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగం కావాలంటే యువత కష్టపడి చదవాలని, అందుకు తప్పనిసరిగా ఒక ప్రణాళిక ఉండాలని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు సూచించారు. తాను టెన్త్ క్లాస్ వరకు యావరేజ్ స్టూడెంట్‌నని, ఫోకస్డ్గా చదవడం ప్రారంభించిన తర్వాత సివిల్స్‌లో ర్యాంకులు వచ్చాయని చెప్పారు. ఈ రోజుల్లో ఉద్యోగాలు అందని ద్రాక్ష కాదని, కష్టపడి చదివితే సాధించడం సులువేనని స్పష్టం చేశారు. చదవడంలో ఒక స్టాండర్డ్ మెయింటెన్ చేయాలని, ఎవరితో కంపేర్ చేసుకోవద్దని, మీకు మీరే కాంపిటేటర్లుగా భావించాలన్నారు. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంయుక్తంగా కరీంనగర్ కేంద్ర గ్రంథాలయం సౌజన్యంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉద్యోగార్థులకు పోటీ పరీక్షలపై నిర్వహించిన ఉచిత అవగాహన సదస్సుకు ఆమె ప్రధాన వక్తగా హాజరయ్యారు. వందలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, అభ్యర్థులకు పోటీల పరీక్షలపై దిశానిర్దేశం చేశారు.
ఈ రోజుల్లో ఉద్యోగాలు అందని ద్రాక్ష కాదనీ, కష్టపడి చదివితే సాధించడం సులువేనని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు స్పష్టం చేశారు. అందుకు తప్పనిసరిగా ప్రణాళిక ఉండాలని, కష్టపడి చదవాలని సూచించారు. ఇప్పటి నుంచి రోజుకు 10 గంటలు అలసట అంటే ఏమిటో తెలియకుండా చదవాలని, చదివిన ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని పరీక్షలకు సిద్ధం కావాలని నిర్దేశించారు. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంయుక్తంగా కరీంనగర్ కేంద్ర గ్రంథాలయం సౌజన్యంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉద్యోగార్థులకు పోటీ పరీక్షలపై నిర్వహించిన ఉచిత అవగాహన సదస్సుకు ఆమె ప్రధాన వక్తగా హాజరయ్యారు. వందలాదిగా తరలివచ్చిన విద్యార్థులు, అభ్యర్థులనుద్దేశించి మాట్లాడారు. యువత జాబ్ కొట్టాలంటే ఫోకస్డ్గా కష్టపడి చదవాలని, ఆ కష్టం ఎలా ఉండాలంటే మీలా మరెవ్వరూ కష్డపడకూడదు అన్నట్లుగా ఉండాలని సూచించారు.
సిలబస్ మొత్తం బట్టీ పట్టకుండా ఒక్కసారి మోడల్ పేపర్స్ పరిశీలించాలని, వాటిని బేస్ చేసుకుని మోడల్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలని చెప్పారు. యూపీఎస్సీ నుంచి గ్రూప్-1, 2 వరకు అన్ని పరీక్షల సిలబస్‌ను గుర్తించి చదువుకోవాలని, ప్రతి సబ్జెక్ట్‌కు సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలన్నారు. తెలుగు అకాడమీ పుస్తకాలను ఎంచుకోవాలని, అలాగే ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలని సూచించారు. సిలబస్‌పై అనాలసిస్ ఉంటే ఏ ఉద్యోమైనా సాధిస్తారని స్పష్టం చేశారు. తెలంగాణను అభివృద్ధి చేయాలంటే ఒక్క సీఎంతోనో, మంత్రులతోనో సాధ్యం కాదని, అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే యువతగా మీరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాలు సాధించి బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని, తద్వారా బంగారు భారతదేశం నిర్మితమవుతుందని చెప్పారు.
ప్రతిభను నమ్ముకోండి
ఏ రాష్ట్రంలో చూసినా వెయ్యి, రెండు వేల ఉద్యోగాలు ఒకేసారి కల్పిస్తే అది గొప్పగా భావిస్తారు. అలాంటిది తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి 80,039 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి. నేను 1990లో 74 శాతం మార్కులతో బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం అన్వేషించినపుడు నీకు టైప్ వస్తుందా?, షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నావా? అని ఆంధ్రా అధికారులు అవమానించారు. నెలకు రూ.650కి ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేశా. నేను చదువుకున్నప్పుడు కేసీఆర్ సీఎంగా ఉంటే తప్పక ప్రభుత్వ ఉద్యోగం సాధించే వాడిని. ఉమ్మడి రాష్ట్రంలో జోనల్ వ్యవస్థను తెచ్చి ఆంధ్రోళ్లు తెలంగాణకు దక్కాల్సిన ఉద్యోగాలను తన్నుకు పోయారు.
విజయవాడ, గుంటూరు, నెల్లూరు వంటి జిల్లాల నుంచి వచ్చి జోన్ల పేరుతో హైదరాబాద్ ఉద్యోగాల్లో స్థిరపడే వారు. తెలంగాణలో ఉన్న నిరుద్యోలు దుబాయికో, మస్కట్కో వలస వెళ్లేవారు. ఏ బొగ్గుబాయి నౌకర్లలోనే స్థిరపడేది. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కేలా కొత్త జోనల్ వ్యవస్థను తీసుకువచ్చారు. గ్రూప్స్‌లో గతంలో ఇంటర్వ్యూలు ఉండేవి. అది పెద్ద తతంగమని వాటిని రద్దు చేశారు. కేవలం మెరిట్ మార్కుల ద్వారానే ఉద్యోగాలు సాధించే అవకాశాన్ని కల్పించారు. నియామకాల్లో పైరవీలకు తావు లేదు. కేవలం ప్రతిభను నమ్ముకోండి. నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తూ ఉపకారవేతనాలు అందించే విధానం తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదు.
– మంత్రి గంగుల కమలాకర్
సిస్టమెటిక్ రివిజన్ చేయాలి
సబ్జెక్ట్ చదవడంలో చాలా మందికి కాన్ఫిడెన్స్ ఉండదు. ఇప్పుడు లోకాన్ఫిడెన్స్ నుంచి హై కాన్ఫిడెన్స్‌కు రావడానికి ప్రయత్నించాలి. మీరు పడే కష్టానికి తప్పకుండా ఫలితం ఉంటుంది. ఇన్ని వేల ఉద్యోగాల్లో ఏదో ఒక ఉద్యోగం సాధించడం ఖాయం. అకాడమీ పరీక్షలు, పోటీ పరీక్షలకు చాలా తేడా ఉంటుంది. అకాడమిక్ పరీక్షల్లో అర మార్కు చూసీ చూడనట్లు వేసేస్తారు. కానీ, పోటీ పరీక్షలో ఎక్కడ అర మార్కు తప్పు చేశాడో అని చూసి కొట్టి పడేస్తారు. సక్సెస్ కోసం బ్లూ ప్రింట్ అవసరం. ప్రతి ఒక్కరూ బ్లూ ప్రింట్ స్ట్రాటజీ తయారు చేసుకోవాలి. ప్రిపరేషన్ కోసం నాలెడ్జ్, స్కిల్స్‌తో పాటు ఫిజికల్‌గా సంసిద్ధులై ఉండాలి. మానసికంగా దృఢంగా ఉండాలి. ఈ ఉద్యోగం నేను సాధిస్తానన్న నమ్మకం గట్టిగా ఉండాలి. ప్రతి రోజూ మీలో ఫైర్ అనేది రగలాలి. కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు, చదివినప్పుడు 24 గంటల్లో కేవలం 20 శాతం మాత్రమే గుర్తుంటాయి.
మిగతా 80 శాతం మైండ్ నుంచి ఎగిరిపోతాయి. వాటిని కాపాడుకోవాలంటే ఒక సిస్టమెటిక్ రివిజన్ అలవాటు చేసుకోవాలి. రోజుకు కనీసం ఐదు సార్లు రివిజన్ చేస్తే మీరు చదివిన, తెలుసుకున్న విషయాల్లో 90 శాతం గుర్తుండి పోతాయి. మీరు చదివిన విషయాలను నోట్ చేసుకోండి. చదివే ప్రతి పేరాగ్రాఫ్‌లో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రతి విషయాన్ని విజువలైజేషన్ చేసుకోండి. ఒక సినిమా మాదిరిగా గుర్తుంచుకోండి. చదవడంలో టైమ్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. నిద్ర నుంచి లేచిన తర్వాత చదివిన విషయాలు ఎక్కువ కాలం గుర్తుండి పోతాయి. చదివిన ప్రతి విషయాన్నీ సక్సెస్ డైరీలో పొందుపర్చుకోండి. రోజుకు ఒక గోల్ నిర్ణయించుకొని దాన్ని పూర్తి చేయాలి. అప్పుడే మీరు ఎంతో కాన్ఫిడెంట్‌తో పోటీ పరీక్షలు రాయగలుగుతారు. ప్రభుత్వోద్యోగం సాధించడంలో అందరికంటే ముందుంటారు.
– డాక్టర్ సీఎస్ వేప, వేప అకాడమీ ఆఫ్ హైదరాబాద్ డైరెక్టర్
ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యం కావాలి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పటికే అనేక దఫాల్లో 18 వేల పోస్టులు భర్తీ చేసింది. ఇప్పుడు మరో 16 వేలకుపైగా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో 550 ఎస్ఐ క్యాడర్ పోస్టులు ఉన్నాయి. గ్రూప్-1లో 503 పోస్టులుంటే అందులో 91 డీఎస్పీ పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాల్లో చిన్నదా, పెద్దదా అని చూడకుండా అవకాశం వచ్చిన ప్రతి ఉద్యోగానికీ దరఖాస్తు చేసుకోండి. గతంలో మహిళలకు కేవలం 10 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉండేవి. ఇప్పుడు 33 శాతం ఇచ్చారు. అమ్మాయిలు పోలీస్ ఉద్యోగం చేయాలా.. వద్దా.. ఇది 30 ఏండ్ల కింది ప్రశ్న. ఇప్పుడు ఆ ప్రశ్నే అవసరం లేదు.
ఏ పోలీస్ స్టేషన్లో చూసినా మహిళా కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు కనిపిస్తున్నారు. మహిళలు ఎస్ఐలు, సీఐలుగా, డీఎస్పీలుగా రాణిస్తున్నారు. పోలీసు ఉద్యోగాల కోసం ప్రభుత్వం ఉచితంగా శిక్షణ కూడా ఇస్తున్నది. ఇన్ని సదవకాశాలను వినియోగించుకోండి. ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యం కావాలి. దేనికైనా ఒక ప్రణాళికా ప్రకారంగా చదవండి. ప్రతి ఒక్కరికీ స్టడీ ప్లాన్ ఉండాలి. ఒక్కో సబ్జెక్ట్‌కు అనేక రకాల పుస్తకాలు కాకుండా ఒకే పుస్తకాన్ని చదవాలి. దానిని పూర్తిగా అర్థం చేసుకోవాలి. చదివేందుకు షెడ్యూల్, రివిజన్, ప్రాక్టీస్ తప్పనిసరి ఉండాలి. యుద్ధానికి దిగకముందే గెలుపు, ఓటములపై అంచనా వేసుకోవాలి. ఓటమిని ఒప్పుకోకుండా గెలుపు కోసమే ప్రయత్నించాలి.
– సింధూ శర్మ, జగిత్యాల ఎస్పీ
పట్టుదలతో శ్రమిస్తే ఉద్యోగం సాధ్యం
ఎక్కడో ఢిల్లీ, హైదరాబాద్‌లో చదివిన వాళ్లు గొప్పగా చదువుకుంటారని అనుకోవడం తప్పు. ఇప్పుడు రూరల్ ఏరియాల్లో కూడా మంచి చదువు అందుతున్నది. గ్రామాల్లో చదువుకునే వాళ్లు కూడా గొప్ప ఉద్యోగాలు సాధిస్తున్నారు. నేను కూడా కరీంనగర్లో చదువుకున్నా. గత ప్రభుత్వాల హయాంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం 80 వేలకు పైగా ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో గ్రూప్-1, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. యువతకు ఇంతకన్నా మంచి అవకాశం రాదు. పోటీ పరీక్షలకు నిరుద్యోగులను సన్నద్ధం చేసేందుకు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు తమవంతు బాధ్యతగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నాయి. నమస్తే తెలంగాణ నిపుణ పేరిట నాలుగు పేజీల స్టడీ మెటీరియల్ ఇస్తున్నది. తెలంగాణ టుడే ఒక బ్రాడ్ షీట్లో స్టడీమెటీరియల్ అందిస్తున్నది. ఇది అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి.
– శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ టుడే ఎడిటర్
సిస్టమెటిక్ రివిజన్ చేయాలి
సబ్జెక్ట్ చదవడంలో చాలా మందికి కాన్ఫిడెన్స్ ఉండదు. ఇప్పుడు లోకాన్ఫిడెన్స్ నుంచి హై కాన్ఫిడెన్స్‌కు రావడానికి ప్రయత్నించాలి. కొత్త విషయాలు నేర్చుకున్నప్పుడు, చదివినప్పుడు 24 గంటల్లో కేవలం 20 శాతం మాత్రమే గుర్తుంటాయి. మిగతా 80 శాతం మైండ్ నుంచి ఎగిరిపోతాయి. వాటిని కాపాడుకోవాలంటే ఒక సిస్టమెటిక్ రివిజన్ అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ బ్లూ ప్రింట్ స్ట్రాటజీ తయారు చేసుకోవాలి. ఈ ఉద్యోగం నేను సాధిస్తానన్న నమ్మకం గట్టిగా ఉండాలి.
– డాక్టర్ సీఎస్ వేప, వేప అకాడమీ ఆఫ్ హైదరాబాద్ డైరెక్టర్
ప్రతిభను నమ్ముకోండి
ఒకే సారి ఇన్ని వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం దేశ చరిత్రలోనే లేదు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కేలా కొత్త జోనల్ వ్యవస్థను తీసుకువచ్చారు. గ్రూప్స్‌లో కేవలం మెరిట్ మార్కుల ద్వారానే ఉద్యోగాలు సాధించే అవకాశాన్ని కల్పించారు. నియామకాల్లో పైరవీలకు తావు లేదు. ఏ రాజకీయ నాయకుడినీ నమ్మద్దు. కేవలం ప్రతిభను నమ్ముకోండి. నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తూ ఉపకారవేతనాలు అందించే విధానం తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదు. ‘నమస్తే తెలంగాణ’లో వస్తున్న నిపుణలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అది చదవండి.
– మంత్రి గంగుల కమలాకర్
ఉద్యోగం సాధించడమే లక్ష్యం కావాలి
ఇన్ని వేల ఉద్యోగాల్లో చిన్నదా, పెద్దదా అని చూడకుండా అవకాశం వచ్చిన ప్రతి ఉద్యోగానికీ దరఖాస్తు చేసుకోండి. గతంలో మహిళలకు కేవలం 10 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఉండేవి. ఇప్పుడు 33 శాతం ఇచ్చారు. అమ్మాయిలు పోలీస్ ఉద్యోగం చేయాలా.. వద్దా.. ఇది 30 ఏండ్ల కింది ప్రశ్న. ఇప్పుడు ఆ ప్రశ్నే అవసరం లేదు. ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యం కావాలి. దేనికైనా ఒక ప్రణాళికా ప్రకారంగా చదవండి.