కరీంనగర్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ)/ కమాన్‌చౌరస్తా : ప్రభుత్వ ఉద్యోగాలు ఏ విధంగా సాధించాలనే అంశంపై జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ సౌజన్యంతో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ శుక్రవారం కరీంనగర్‌లోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఉచిత అవగాహన సదస్సు విజయవంతమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి సుమారు 2 వేల మంది ఉద్యోగార్థులు హాజరు కాగా, పోటీ పరీక్షలకు ఏ విధంగా సిద్ధం కావాలో వక్తలు దిశానిర్దేశం చేశారు. ఈ సదస్సు తమకెంతో ఉపయోగకరంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రఖ్యాత ఫ్యాకల్టీతో అవగాహన కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సదస్సులు మరిన్ని నిర్వహించి మిగతా వారికి అవగాహన కల్పించాలని కోరారు.
నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్, బ్యూరో ఇన్చార్జి ప్రకాశ్‌రావు అధ్యక్షతన జరిగిన సదస్సును రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రఖ్యాత ఫ్యాకల్టీ డాక్టర్ సీఎస్ వేప, బాలలత మల్లవరపుతోపాటు జగిత్యాల ఎస్పీ సింధూ శర్మ నిరుద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. పోటీ పరీక్షలను ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఎలా చదవాలి, సైకలాజికల్‌గా ఎలా సిద్ధపడాలనే అంశాలపై అవగాహన కల్పించారు. వీరి ఉపన్యాసాలను ఉద్యోగార్థులు ఎంతో శ్రద్ధగా, ఏకాగ్రతతో విన్నారు. డాక్టర్ సీఎస్ వేప పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
అనంతరం నిర్వహించిన ప్రశ్నా, జవాబు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో వారికి ఎదురయ్యే సందేహాల గురించి అడిగి నివృత్తి చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో కనిపించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారం జగదీశ్వర్, దారం శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చల్ల హరిశంకర్, స్థానిక కార్పొరేటర్ జితేందర్, తదితరులు పాల్గొన్నారు.
ఉజ్వల భవిష్యత్ పొందాలి
కరీంనగర్ జిల్లా లైబ్రరీకి కావాల్సిన సదుపాయాల కల్పన కోసం కార్పొరేషన్ ఆధ్వర్యంలో సహకరిస్తాం. త్వరలోనే రూ.4 కోట్లతో భవన నిర్మాణాన్ని ప్రారంభిస్తాం. ఉద్యోగ నోటిఫికేషన్ పరీక్షలు ముగిసే వరకు నిరుద్యోగులకు భోజన సౌకర్యం కల్పిస్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకొని ఉజ్వల భవిష్యత్ పొందాలి. సమాజంలో ఉద్యోగులకు ఉండే గౌరవం గొప్పది. తెలంగాణ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఉద్యోగ నోటిఫికేషన్లలో రిక్రూట్ అయిన మహిళలు సైతం ఉత్సాహంతో పని చేస్తున్నారు. మీరు కూడా తొలి ప్రయత్నంలో గ్రూప్-1లో ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటున్నా.
–కరీంనగర్ మేయర్ సునీల్‌రావు
గతంలో గ్రంథాలయాలను పట్టించుకోలె..
గత ప్రభుత్వాల పాలనలో గ్రంథాలయాలను పట్టించుకోలేదు. కరీంనగర్ జిల్లా లైబ్రరీకి కేవలం 30 నుంచి 40 మంది వరకు మాత్రమే వచ్చేవారు. నేను గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయ్యాక ప్రస్తుతం రోజూ 300 నుంచి 400 మంది వస్తున్నారు. స్మార్ట్ సిటీ నిధులతో జీ ప్లస్-5 గ్రంథాలయ భవన నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తున్నాం. గ్రంథాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్‌రావు ఎంతో సహకరిస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేసిన ముఖ్యమంత్రికి, నిరుద్యోగులకు అవగాహన కల్పిస్తున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే పత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.
– జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి
అనేక అంశాలపై అవగాహనకలిగింది
బాలలత మేడం చెప్పే క్లాస్ కోసం ప్రత్యేకంగా వచ్చిన. ఆమె చెప్పిన అంశాలతో ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం కుదిరింది. ఈ సదస్సులో వివిధ సబ్జెక్టులకు సంబంధించిన అనేక అంశాలపై అవగాహన కలిగింది. ఎలాంటి పుస్తకాలు ఎంపిక చేసుకోవాలో తెలిసివచ్చింది. ఇక బాగా ప్రిపేరవుత. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన నమస్తే తెలంగాణకు ప్రత్యేక కృతజ్ఞతలు.