వేములవాడ, ఏప్రిల్ 29: రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులకు అడుగులు వేగంగా ముందుకు పడుతున్నాయి. భూసేకరణలో భాగంగా ఇప్పటికే పరిహారం అందజేత దాదాపు పూర్తయింది. మొత్తం 39గుంటల స్థలాన్ని సేకరించి ఇందులో రూ.17కోట్ల 54లక్షల పరిహారాన్ని అందజేశారు. దీంతో భూసేకరణ పూర్తికాగా త్వరలోనే అభివృద్ధి ప్రణాళికలు పూర్తి స్థాయిలో రూపొందించి వేగవంతానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
39గుంటలు.. రూ. 17.54కోట్ల పరిహారం
ప్రస్తుతం రెండు గుంటల్లో ఉన్న బద్ది పోచమ్మ ఆలయాన్ని దాదాపుగా ఎకరం స్థలంలో విస్తరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు భూసేకరణ చేయాలని నిర్ణయించి ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు నిర్వాసితులతో మాట్లాడి ఒప్పించి వారి నుంచి భూసేకరణ ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో 39గుంటల స్థలాన్ని సేకరించాలని నిర్ణయించి అందుకు పరిహారం కూడా రూ. 17కోట్ల54లక్షలు అందజేసి పూర్తిస్థాయిలో భూసేకరణ పూర్తిచేశారు. ఆస్తి విషయంలో ఒకరు కోర్టును ఆశ్రయించగా 91గజాల మినహా మొత్తం భూసేకరణ పూర్తయింది.
అభివృద్ధి నమునాల కసరత్తు..
బద్దిపోచమ్మ ఆలయాన్ని విస్తరించేందుకు నమునాలపై కసరత్తు చేయనున్నారు. భక్తులకు సౌకర్యార్థం బోనాల మండపాలు క్యూ కాంప్లెక్స్‌లతో పాటు ఇతర వసతులను సౌకర్యవంతంగా చేయనున్నారు. భూసేకరణ పూర్తికావడంతో పరిహారం అందుకున్న నిర్వాసితులు ఖాళీ చేయాలని నోటీసులు కూడా జారీచేసేందుకు సిద్ధమవుతున్నారు. వారం రోజుల్లో నోటీసుల ప్రక్రియ కూడా ప్రారంభం కానున్నది.
నిర్వాసితులను ఖాళీ చేయాలని నోటీసులిస్తాం
భూ సేకరణ ఇప్పటికే పూర్తియినందున అభివృద్ధి పనుల వేగవంతానికి త్వరలోనే నిర్వాసితులకు ఖాళీ చేయాలని నోటీసులిస్తాం. ఖాళీ స్థలం అప్పగిస్తే ప్రణాళికలకు వేసేందుకు సులువుగా ఉటుంది. 91గజాలు మినహా మొత్తం సేకరణ పూర్తయింది. అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి.
– గంప సత్యనారాయణ వీటీడీఏ ఎస్టేట్ అధికారి, వేములవాడ