కొత్తపల్లి, ఏప్రిల్ 29: రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం మంత్రి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్‌పూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, 6920 కేంద్రాలు అవసరముండగా ఇప్పటికే 2384 కేంద్రాలను ప్రారంభించి 1.86 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ఇందులో 1.74లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లుకు తరలించినట్లు తెలిపారు. రెండురోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసినట్లు చెప్పారు. వడ్లను కొనడంలేదని గిట్టనివారు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారి అబద్ధపు మాటలను పట్టించుకోవద్దని రైతులకు సూచించారు.
ఈ యాసంగిలో 15కోట్ల గన్నీ బ్యాగులు అవసరముండగా ఇప్పటికే 6.85 కోట్ల సంచులను సిద్ధం చేశామన్నారు. గన్నీ సంచులను అందుబాటులో ఉంచాల్సిన కేంద్రం బాధ్యత నుంచి తప్పించుకుంటున్నదని విమర్శించారు. కేంద్రం సహకరించకున్నా ధాన్యం సేకరణలో ఇబ్బందులులేకుండా చూస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక భారంపడుతున్నా లెక్కచేయకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారని పేర్కొన్నారు. ఎక్కడా కూడా కిలో తరుగు తీయడం లేదని చెప్పారు. మిల్లర్లు, రైతులకు మధ్య సంబంధం లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ఈ సీజన్లో దండిగా ధాన్యం దిగుబడి వస్తుండడంతో రైతులందరూ సంతోషంగా ఉంటే ఓర్వలేనివారు అబద్ధపు ప్రచారాన్ని సాగిస్తున్నారని ఆక్షేపించారు. ఎంపీపీ పిల్లి శ్రీలతామహేశ్గౌడ్, జడ్పీటీసీ పిట్టల కరుణ, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సురేశ్, సర్పంచ్ జినుక సంపత్ పాల్గొన్నారు.