విద్యానగర్, ఏప్రిల్ 29: జిల్లాలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచి, సిజేరియన్లను తగ్గించాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వైద్యాధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేట్ గైనకాలజిస్టులు, పురోహితులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సిజేరియన్లు ఎకువగా ముహూర్తాల ద్వారా జరుగుతున్నందున స్త్రీ, ప్రసూతి వైద్య నిపుణులు, పురోహితులు వాటిని తగ్గించడానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా సిజేరియన్ ప్రసవాలతో కలిగే అనర్థాలు, సాధారణ ప్రసవాలతో కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ను ఆయన గైనకాలజిస్టులతో కలిసి ఆవిషరించారు. పోస్టర్ను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కాగా, గైనకాలజిస్టులు సిజేరియన్లు తగ్గించడానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, జిల్లాలోని వైద్యాధికారులతో ఆరోగ్య కార్యక్రమాల ప్రగతిపై కలెక్టర్ సమీక్షించారు. 12 వారాల్లోపు గర్భిణుల వివరాలు వందశాతం నమోదు చేయాలని, అంగన్వాడీ, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఇంటర్, పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డీఎంహెచ్వో డాక్టర్ జువేరియా, జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, డీసీహెచ్ఎస్ రత్నమాల, జిల్లా సమన్వయకర్త శివకృష్ణ, గైనకాలజిస్టులు తదితరులు పాల్గొన్నారు.