హుజూరాబాద్టౌన్, ఏప్రిల్ 29: నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా సరళత్వం, బహుళ కోర్సులను ఎంపిక చేసుకునే అవకాశం లభించడం గొప్ప విషయని తెలంగాణ కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. హుజూరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘రిసార్మింగ్ ఇండియన్ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టం- రోల్ ఆఫ్ ఎన్ఈపీ-2020, అండ్ చాలెంజెస్’ అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపాల్ గొడిశాల పరమేశ్ అధ్యక్షత వహించగా, విశిష్ట అతిథిగా నవీన్ మిట్టల్ అంతర్జాలంలో సందేశాన్ని ఇచ్చారు. నిర్వాహకులను అభినందించారు.
ప్రత్యేక అతిథిగా విచ్చేసిన కరీంనగర్ ఎస్సారార్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే రామకృష్ణ మాట్లాడారు. దేశాభివృద్ధికి దోహదపడేలా ఎన్ఈపీ 2020 విద్యా విధానం రూపొందించడం అభినందనీయమన్నారు. మరో ముఖ్య అతిథి హైదరాబాద్లోని సీసీఈ అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ డాక్టర్ డీ తిరువెంగలాచారి మాట్లాడుతూ ఎన్ఈపీ 2020 ద్వారా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులను ఎంచుకొని తద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, ఆర్ట్స్, కామర్స్, సైన్స్ కాంబినేషన్ల ఎంపిక చాలా గొప్ప విషయం అని ఆయన పేరొన్నారు. ప్రిన్సిపాల్ పరమేశ్ మాట్లాడుతూ ఈ జాతీయ సదస్సు ద్వారా కళాశాల కీర్తి ప్రతిష్టలు పెరిగాయని, ప్రస్తుతం జాతీయ స్థాయిలో 90 పత్రాలు రావడం గర్వకారణమని అన్నారు. అనంతరం కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పీ ఎల్ఎన్ మూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ దినకర్ మాట్లాడగా, వివిధ కళాశాలల నుంచి వచ్చిన ఉపన్యాసకులు ఎస్ మధు, ఉదయశ్రీ, రాజ్ కుమార్, చారి, హరి ప్రసాద్, శ్యామలదేవి, స్వరూప, రమేశ్ పాల్గొన్నారు.