విద్యానగర్, ఏప్రిల్ 27: ప్రభుత్వ దవాఖాన ల్లో ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓపీ సేవలు కొనసాగించాలని, ఈ సమయంలో వైద్యులు ప్రైవేట్‌గా ప్రాక్టీసు చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ హెచ్చరించారు. వైద్యులు, సిబ్బంది సమయపాల న పాటించాలని ఆదేశించారు. బుధవారం ఉద యం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా ఓపీ బ్లాక్‌లో వెళ్లిన ఆయన అక్కడ వైద్యులు కనిపించకపోవడంతో హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. 12మంది వైద్యులు విధులకు హాజరు కాలేదని గుర్తించి, వారందరికీ అప్పటికప్పుడే మెమో లు జారీ చేయాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాలను ఆదేశించారు.
కమిషనర్ వచ్చారనే సమాచారం తెలుసుకున్న వైద్యులు, సిబ్బంది హుటాహుటిన దవాఖానకు చేరుకున్నా రు. సగం మంది సిబ్బంది కూడా సమయానికి రాకపోవడంతో ఆర్ఎంవో, సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డుల్లో కలియతిరిగి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఓ రోగి వద్దకు వెళ్లి కేసు షీట్‌ను పరిశీలించారు. అందులో హైరిస్క్ అని రాసి ఉండగా రోగి ని పరిశీలించగా అది హైరిస్క్‌గా లేదని అలాంటిది ఇలా హైరిస్క్ రాయడం ఏంటని వైద్యులను ప్ర శ్నించారు. ఇలా ప్రతి కేసుకు హైరిస్క్ అని రిఫర్ చేస్తూ చేతులు దులుపుకోవడం సరైంది కాదని, తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. తర్వాత నేరుగా ఎంసీహెచ్‌కు వెళ్లి అక్కడ అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఓపీ బ్లాక్ వద్ద వెలుతురు లేకుండా చీకటిగా ఉండడంతో లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు దవాఖానను సందర్శించామన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వైద్యులు, సిబ్బందితో ఎప్పటిప్పుడు సమీక్షలు చేస్తూ అప్రమత్తం చేస్తున్నారని వివరించారు. విధులకు ఆలస్యంగా వచ్చిన 12మంది వైద్యులకు మెమోలు జారీ చేయాలని ఆదేశించామని, వీరంతా నాలుగు రోజుల్లో వివరణ ఇవ్వాలని చెప్పారు. కొంత మంది వైద్యులు, సిబ్బంది కొన్ని కేసులను ప్రైవేట్‌కు రెఫర్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని, పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవన్నారు. వైద్యుల వ్యక్తిగత ఫర్ఫార్మెన్స్ను పరిగణనలోకి తీసుకుంటామని, పనిచేయని వారుంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. దవాఖానలో బయోమెట్రిక్ హాజరు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.
బయోమెట్రిక్ ఆధారంగానే వేతనాలు చెల్లించాలన్నారు. ఫార్మసీ విభాగంలో అధికారుల డ్యూటీ రోస్టర్లను ఫార్మసీ సిబ్బంది పాటించడం లేదని, అన్ని విభాగాలకు సంబంధించి అలాంటి వారి వివరాలను తమకు ఇవ్వాలన్నారు. దవాఖాన సూపరింటెండెంట్, ఆర్ఎంవోలు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ మెరుగైన వైద్య సేవలందేలా సూచనలు ఇవ్వాలన్నారు. ఎక్స్‌రే గదిలో బైక్ పెట్టినట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తపై విచారించి రేడియోగ్రాఫర్‌ను విధుల నుంచి తొలగించినట్లు వైద్యాధికారులు కమిషనర్‌కు తెలిపారు. కాగా కొవిడ్ సమయంలో పనిచేసిన కాలానికి సంబంధించి రెమ్యూనరేషన్ ఇవ్వాలని నర్సింగ్ సిబ్బంది కోరగా, ఆ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించామని, త్వరలో మంజూరయ్యేలా చర్యలు చేపడుతామని కమిషనర్ చెప్పారు. మూడు గంటల పాటు కమిషనర్ దవాఖానలో ఉండడంతో వైద్యులు, సిబ్బంది పూర్తిస్థాయిలో విధులకు హాజరయ్యారు. ఆయన వెంట ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రమేశ్‌కుమార్, ఆఫీసర్ సూపరింటెండెంట్ జితేందర్‌రావు, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, ఆర్ఎంవో డాక్టర్ జ్యోతి, ఏవో నజీముల్లాఖాన్, కార్యాలయ సూపరింటెండెంట్ పుల్లెల సుధీర్, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.