కార్పొరేషన్, ఏప్రిల్ 27: యాసంగి ధాన్యం కొనే బాధ్యతల నుంచి కేంద్రం పారిపోతే.. ఏ ఒక్క రైతు నష్టపోవద్దనే ఉద్దేశంతో స్వయంగా కొనుగోలు బాధ్యతలు తీసుకున్న గొప్ప వ్యక్తి అని.. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన టీఆర్ఎస్ 21 వారికోత్సవ సభలో సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపే తీర్మానాన్ని బలపర్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాలకులకు చరిత్రపై అవగాహన ఉండాలని, తెలియకపోతే తెలుసుకోవాలని సూచించారు. 1943లో నార్త్‌ఈస్ట్‌లో వరి దిగుబడులు పూర్తిగా తగ్గి పశ్చిమబెంగాల్లో తీవ్ర కరువు సంబవించిందని, దీని వల్ల ఆకలితో అలమటిస్తూ సుమారు 30 లక్షల మందికి పైగా చనిపోయారని పేర్కొన్నారు. ఆ పరిస్థితుల్ని అధిగమించడానికి నాటి బ్రిటిష్ ఇండియాలోనే వరి ప్రాముఖ్యతను గుర్తించి ఒడిషాలోని కటక్‌లో 1945లో వరి పరిశోధన సంస్థను ఏర్పాటు చేశారని చెప్పారు.
1950 జనవరి 26న అమలులోకి తెచ్చిన అంబేదర్ రాజ్యాంగంలో సైతం షెడ్యూల్ 7, ఆర్టికల్ 246లో దేశ ఆహార అవసరాలపై రాష్ట్రానికి, కేంద్రానికి సంపూర్ణమైన విధులు, బాధ్యతలతో దిశా నిర్దేశం చేసినట్లు వివరించారు. భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతాయో వాటి ఉత్పత్తిని పెంచే బాధ్యతను రాష్ట్రాలకు, వాటికి మద్దతు ధరల నిర్ణయం, సేకరణ, సరఫరా బాధ్యతను పూర్తిగా కేంద్రానికి అప్పగిస్తూ రాజ్యాంగంలో సుస్పష్టం చేశారని చెప్పారు. దేశం మళ్లీ దుర్భిక్ష పరిస్థితుల్లోకి వెళ్లకూడదని 1964లో రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పార్లమెంట్ ఆమోదించిన చట్టమే ఎఫ్‌సీఐ యాక్ట్ అని చెప్పారు. అలా 1965 జనవరి 14న ఏర్పడిందే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని గుర్తు చేశారు. దిగుబడి పెంచడమే కాకుండా పోషకాలతో కూడిన ఆహారం అందించేందుకు 1967లో జర్మనీ నుంచి కేంద్రం దిగుమతి చేసిన సాంకేతికతే బాయిల్డ్ రైస్ అని, అప్పటి నుంచి ఇప్పటిదాకా మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా యాసంగిలో బాయిల్డ్, వానకాలంలో రా రైస్ ఇస్తున్నామని చెప్పారు.
ఈ విధానాన్ని కేంద్రం ఎందుకు మార్చిందో అర్థంకావడం లేదని మండిపడ్డారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశంతో మంత్రులంతా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసినా.. ఎన్ని లేఖలు రాసినా స్పందించలేదని, పైగా దేశానికి అన్నం పెడుతున్న తెలంగాణ రైతులను గోయల్ నూకలు తినమని అవమానించారని మండిపడ్డారు. ప్రతి విధానం రైతు సంక్షేమంతోనే ముడిపడి ఉందని, రైతు బంధు ఇచ్చినా.. బీమా కల్పించినా.. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చినా.. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో నీళ్లు అందించినా.. చివరికి కేంద్రం చేతులెత్తేస్తే మద్దతు ధరతో ధాన్యం సేకరించినా అది దేశం మొత్తంలో కేవలం మా నాయకుడు కేసీఆర్‌కే చెల్లుతుందని కొనియాడారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను, జీవితాంతం కేసీఆర్ రుణపడి ఉంటానని, రైతులెన్నడూ కేసీఆర్‌ను వదలరని, వాళ్ల దీవెనలు కేసీఆర్‌పై ఉంటాయని మంత్రి గంగుల పేర్కొన్నారు.