విద్యానగర్, ఏప్రిల్ 24: మహిళల్లో వేధిస్తున్న సర్వైకల్, బ్రెస్ట్ కాన్సర్ అడ్డుకట్టకు అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయని మాజీ ఎంపీ, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ పేర్కొన్నారు. నివారణకు వ్యాక్సినేషన్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రెనే హాస్పిటల్లో బీఎన్‌రావు హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి, మాట్లాడారు. స్క్రీనింగ్ చేయడం ద్వారా మహిళల్లో కాన్సర్‌ను ముందే గుర్తించి తగిన వైద్యం అందిస్తే నయమవుతుందని చెప్పారు. తల్లిదండ్రులు సైతం బిడ్డలకు క్యాన్సర్ కారక వ్యాక్సినేషన్లు ఇప్పించాలని సూచించారు. డాక్టర్ బీఎన్‌రావు హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు రక్తహీనత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం, మహిళలకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయడం వారి సేవలకు నిదర్శనమని ప్రశంసించారు.
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల నుంచి ప్రజల్లో రక్తహీనత తొలగించేందుకు మెక్రోన్యూట్రియన్స్ను అందించనున్నట్లు చెప్పారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ, క్యాన్సర్ పా జిటివ్ వచ్చిన వారికి నిమ్స్‌లో ప్రభుత్వ పరంగా వైద్య సేవలు అందించడానికి తోడ్పాటును అందిస్తామని వివరించారు. బీఎన్‌రావు హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ బీఎన్‌రావు మాట్లాడుతూ, సమాజం లో ప్రమాదకరమైన మధుమేహం, బీపీ, క్యాన్సర్‌తో ప్రజలు సతమతమవుతున్నారని, స్క్రీనింగ్ ద్వారా ముందే గుర్తించి వైద్యం చేస్తే బయటపడవచ్చని చెప్పారు. డీఎంహెచ్‌వో జువేరియా మాట్లాడుతూ మహిళల్లో క్యాన్సర్ వ్యాధి తీవ్రత పెరుగకముందే నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని, వ్యాక్సినేషన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
చల్మెడ ఆనందరావు వైద్యకళాశాల డైరెక్టర్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, బీఎన్‌రావు ఫౌండేషన్ సేవలు ఎనలేనివని కొనియాడారు. రెనే హాస్పిటల్ ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ బంగారి రజని ప్రియదర్శిని మాట్లాడుతూ, రెనే హాస్పిటల్లో శిబిరంలో 350 మందికి పరీక్షలు చేసినట్లు చెప్పారు. ఇక్కడ వైద్యులు ఝాన్సీ, విజయలక్ష్మీ, చేతన, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ చెన్నాడి అమిత్‌కుమార్, డాక్టర్ అలీమ్, ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ అరుణ్ కఠారి, వైద్యులు మాధవి, దాసరి శ్రీదేవి, మానస, జాహ్నవి, ఆది శ్రీదేవి, గీతారెడ్డి, వెంకటేశ్వర్లు ఉన్నారు.