కరీంనగర్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :కోతల వెంటే కొనుగోళ్లు షురూ అవుతున్నాయి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన వడ్లు కొనేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 15.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్‌కు వచ్చే అవకాశముండగా, మొత్తం 1,238 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాకలో మొదటి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించగా, ఒకటీ రెండు రోజుల్లో మెజార్టీ చోట్ల ప్రారంభించనున్నది. కేంద్రానికో ప్రత్యేకాధికారిని నియమించి, క్షేత్రస్థాయిలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాల వారీగా కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. ఆయా ప్రాంతాలు, గ్రామాల్లో ఉండే డిమాండ్‌ను బట్టి.. మరిన్ని కేంద్రాలను పెంచేందుకు క్షేత్రస్థాయి అధికారులకు అవకాశం కల్పించారు.
కేంద్రం మొండిచేయి చూపినా.. రాష్ట్ర సర్కారు అన్నదాతకు అండగా నిలుస్తున్నది. యాసంగిలో పండించిన ప్రతి గింజనూ కొనేందుకు సిద్ధమవుతున్నది. ఇందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించిన మేరకు కలెక్టర్లు ఇప్పటికే జిల్లాల్లో క్షేత్రస్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలు, రైతులు ఇబ్బంది పడకుండా కల్పించాల్సిన సౌకర్యాలు, ప్రస్తుతమున్న గన్నీ సంచులు, టార్పాలిన్లు, తేమ శాతం కొలిచే మిషన్లు, ప్యాడీ క్లీనర్స్ వంటి వాటిపై సమీక్షించడంతోపాటు గతంలో మాదిరిగానే కొనుగోళ్లు చేపట్టాలని, అందుకు అన్నీ సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఆ మేరకు క్షేత్రస్థాయి అధికారులు ఏర్పాటు చేయాల్సిన కేంద్రాల వివరాలను పంపించగా.. వాటికి ఆమోద ముద్ర వేశారు. అందులో భాగంగానే మొత్తం ఉమ్మడి జిల్లాలో 1,238 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు, ఆయా ప్రాంతాల్లో వచ్చే ధాన్యం దిగుబడులకు అనుగుణంగా కొత్తగా మరిన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడమే కాకుండా.. క్షేత్రస్థాయి అధికారులే నిర్ణయాలు తీసుకునే విధంగా కలెక్టర్లు వెసులుబాటు కల్పించారు.
ఇదిలా ఉండగా బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇదే తరహాలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒకటి రెండు రోజుల్లో ఆ ప్రాంత అవసరాలకు అనుగుణంగా ప్రారంభించనున్నారు. కరీంనగర్ జిల్లాలో ముందుగా వరి నాట్లు వేసిన మానకొండూర్, హుజూరాబాద్, వీణవంక, శంకరపట్నం మండలాల్లో రైతులు ఇప్పటికే కోతలు ప్రారంభించగా, నేడో రేపో కేంద్రాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. గురువారం గన్నేరువరం మండలంలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కొనుగోళ్లను ప్రారంభించే అవకాశముండగా, గురు, శుక్రవారాల్లో మంత్రి గంగుల కమలాకర్ జమ్మికుంట, వీణవంక మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు.
కొనుగోలు కేంద్రానికో అధికారి..
కొనుగోళ్లు ప్రణాళికబద్ధంగా చేసేందుకు కేంద్రానికో ప్రత్యేకాధికారిని నియమించనున్నా రు. ఈ మేరకు కలెక్టర్లు సంబంధిత అధికారులను ఆదేశించారు. తద్వారా కొనుగోళ్లతోపాటు ఖరీదు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పడు రవాణా చేయడానికి, అలాగే వాహనాల సమస్య లేకుండా చూడడానికి, రైతులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాల కల్పన విషయంలో ప్రత్యేక శ్రద్ధచూపేందుకు, నిత్యం పర్యవేక్షించేందుకు ప్రత్యేకాధికారుల వ్యవస్థ దోహద పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అంతేకాదు ధాన్యం నిల్వలను ఎప్పటికప్పుడు తరలించేందుకు రవాణా అంశం పై ప్రత్యేక దృష్టిపెట్టారు. కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలుంటే.. నేరుగా డివిజన్, జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా కేంద్రాల వద్ద ఫోన్‌నంబర్లు అందుబాటులో ఉంచనున్నారు.
అన్నదాతలు ఆగం కావద్దు
దళారులు, లేదా ఇతర వ్యక్తులు సృష్టించే పుకార్లను రైతులు నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్ల ప్రక్రియ ఉంటుందని, అయితే కొంత మంది కావాలనే అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేస్తారని, వాటిని నివృత్తి చేసుకునేందుకు ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద అధికారితోపాటు నిర్వాహకులు ఉంటారని, వారిని అడిగి తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కోతలు అయిన వెంటనే ధాన్యాన్ని ఆరబెట్టాలని, తేమ శాతం 17కన్నా ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
క్వాలిటీ ధాన్యాన్ని తీసుకొని రావడం వల్ల కొనుగోలు సులువు అవుతుందని, రైతులు ఈ విషయంపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు. కొనుగోళ్లకు సంబంధించి క్షేత్రస్థాయి అధికారులు ప్రకటించే ప్రణాళికను పాటించాలని, ఒకేసారి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు తెస్తే ఇబ్బంది తలెత్తే ప్రమాదముందని, ఆయా గ్రామ స్థాయి అధికారులు ప్రకటించే తేదీలకు అనుగుణంగా కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసేంత వరకు కేంద్రాలు కొనసాగుతాయని, ఇందులో ఎవరికి ఎటువంటి సందేహం అవసరం లేదని ఇప్పటికే కలెక్టర్లు ప్రకటించారు.
యాసంగి సీజన్లో పండిన ప్రతి ధాన్యపు గింజను రాష్ట్ర సర్కారే కొంటది. వడ్లు కొనాలని విన్నవించినా, రైతుల తరఫున ఢిల్లీలో దీక్ష చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదు. కార్పొరేట్లకు, దొంగలకు లక్షల కోట్లు మాఫీ చేస్తుంది గానీ, 60 లక్షల మంది రైతుల కోసం మూడున్నర వేల కోట్లు ఖర్చు చేయలేకపోతున్నది. మోదీ సర్కారుకు రైతులపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతున్నది. రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఒక్క గింజ కూడా తక్కువ ధరకు అమ్మవద్దు.