కార్పొరేషన్, ఏప్రిల్ 19: క్షేత్రస్థాయిలో పర్యటించి క్లస్టర్ వారీగా దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ వివరాల నివేదికను మూడు రోజుల్లోగా అందజేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్‌పై మంగళవారం ఆయన క్లస్టర్, గ్రౌండింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్లస్టర్ అధికారులు తమ క్లస్టర్లలో ఎన్ని యూనిట్లు ఉన్నాయి, గ్రౌండింగ్ అయినవి ఎన్ని, ఇతర వివరాల నివేదికను మూడు రోజుల్లోగా అందజేయాలని ఆదేశించారు. ట్రాక్టర్, ప్యాసింజర్ వాహనాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు డ్రైవింగ్ లైసెన్స్ బ్యాడ్జి పరిశీలించి ఇవ్వాలన్నారు. డెయిరీ, పౌల్ట్రీ, హోటల్, రెస్టారెంట్, సెంట్రింగ్ తదితర యూనిట్లు పెట్టుకునేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లోని లబ్ధిదారుల యూనిట్లను గ్రౌండింగ్ చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాం ప్రసాద్ లాల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేశ్, డీటీసీ చంద్రశేఖర్ గౌడ్, నెహ్రూ యువ కేంద్రం జిల్లా కో-ఆర్డినేటర్ రాంబాబు, క్లస్టర్ అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.