మానకొండూర్, ఏప్రిల్ 10: మత్స్యకారుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు సంయుక్త ఆర్థిక సహకారంతో మంజూరైన అధునాతన సంచార చేపల విక్రయ వాహనాన్ని ఆదివారం మానకొండూర్‌కు చెందిన మత్స్యకారుడు నెల్లి మురళికి ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మత్స్యకారుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని గుర్తుచేశారు. రూ.10 లక్షల విలువైన ఈ వాహనంలో ఫ్రిడ్జ్, గ్యాస్‌స్టవ్ తదితర సౌకర్యాలు ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, నాయకుడు ముద్దసాని శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.