కలెక్టరేట్, ఏప్రిల్ 7: రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లింలకు అందించే కానుకలు (తోఫా) గురువారం జిల్లా కేంద్రానికి చేరాయి. జిల్లాలో ఎంపిక చేసిన పేద ముస్లింలకు వీటిని అందజేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలోని కరీంనగర్ నియోజకవర్గానికి 4000, మానకొండూర్ నియోజకవర్గానికి 1,000, హుజూరాబాద్‌కు 1,500, చొప్పదండికి 1,000 చొప్పున కానుకలు వచ్చాయి. ఈ మేరకు ఆయా ప్రాంతాలకు ప్రత్యేక వాహనాల్లో రంజాన్ కానుకలను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, నియోజకవర్గాల వారీగా ఎంపికైన మసీదుల్లో ఇఫ్తార్ విందులను ప్రభుత్వం తరఫున నిర్వహించాలని ఆదేశాలు కూడా వచ్చాయి. కానుకలు అందించేందుకు పేద ముస్లింలను ఎంపిక చేసే బాధ్యత స్థానిక మత పెద్దలకు అప్పగించారు. మసీదు పరిధిలో మత పెద్దలతో పాటు తహసీల్దార్లు కలిసి మసీదుకు 500 మంది చొప్పున ఎంపిక చేయనున్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని 6 మసీదుల పరిధిలో 4 వేల మందిని ఎంపిక చేయనున్నారు.
చొప్పదండిలోని మూడు మసీదుల పరిధిలో 1,000 మంది, మానకొండూర్ పరిధిలో 1,000 మంది, హుజూరాబాద్‌లో 1,500 మందిని ఎంపిక చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వీరితో పాటు మతపెద్దలు ఎంపిక చేసిన మరో 500 మందికి కలెక్టర్ కోటా నుంచి రంజాన్ కానుకలు పంపిణీ చేయనున్నారు. అయితే, లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి వివక్షతకు తావులేకుండా చూడాలని, ప్రధానంగా మురికి ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి, వితంతువులు, అనాథలు, వృద్ధులకు ఎంపికలో ప్రక్రియలో అత్యంత ప్రాధాన్యమివ్వాలని మైనార్టీ సంక్షేమ శాఖకు జారీ చేసిన ఉత్తర్వుల్లో కలెక్టర్ సూచించారు. మసీదుల్లో ఇఫ్తార్ విందులు నిర్వహించడానికి నియోజకవర్గ పరిధిలోని మత పెద్దలతోపాటు హెడ్‌క్వార్టర్‌లోని తహసీల్దార్‌ను స్పెషల్ ఆఫీసర్‌గా నియమిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మసీదులను కలుపుకొని మైనారిటీ వెల్ఫేర్ అధికారిని నోడల్ అధికారిగా నియమించారు.