జమ్మికుంట, ఏప్రిల్ 6: మున్సిపల్ పరిధిలోని చిన్నారుల ఆటపాటల కోసం కొండూరు కాంప్లెక్స్‌లో పార్కు నిర్మాణం చేపట్టామని, త్వరలోనే ప్రారంభానికి సిద్ధం చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు వెల్లడించారు. బుధవారం ఆయన 30వ వార్డును సందర్శించారు. వార్డులో నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న పార్కును పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలను చూశారు. తర్వాత చైర్మన్ మాట్లాడారు. కొండూరు కాంప్లెక్స్‌లో ప్రభుత్వ స్థలం నిరుపయోగంగా ఉండేదని, పట్టణంలోని విలువైన భూమిని పార్కు కోసం కేటాయించామని చెప్పారు. అందులో అద్భుతమైన పార్కు నిర్మాణానికి ప్లాన్ తయారు చేయించి, పనులను త్వరగా పూర్తి చేశామని పేర్కొన్నారు. పార్కును అనుకున్న స్థాయిలో సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పట్టణంలోని మున్సిపల్ స్థలాల్లో సుందరీకరణతో పాటు పార్కులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అభివృద్ధి పనులన్నీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయన్నారు. అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల నిధులైనా వెచ్చించేందుకు పాలకవర్గం సిద్ధంగా ఉందని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. జమ్మికుంట మున్సిపల్‌పై సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, నిధుల వరద పారిస్తున్నారని పేర్కొన్నారు. చైర్మన్‌తో కౌన్సిలర్లు మద్ది లావణ్య-సంపత్, దయ్యాల శ్రీనివాస్, పాతకాల రమేశ్, నాయకులు పొనగంటి మల్లయ్య, ఎలగందుల శ్రీహరి తదితరులున్నారు.