జమ్మికుంట, మార్చి 21: ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని సర్కారు పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభించనున్న దృష్ట్యా ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ సూచించారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన కోసం అందరూ మెళకువలు నేర్చుకోవాలని చెప్పారు. సోమవారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధన కోసం ‘ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ కోర్స్(ఈఎల్‌ఈసీ) అయిదు రోజుల శిక్షణ శిబిరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎంఈవో ఉపాధ్యాయులనుద్దేశించి మాట్లాడారు. ఇంగ్లిషులో బోధించేందుకు జిల్లా నుంచి ప్రత్యేకంగా ఎంపిక చేసిన భాషా నిపుణులతో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో విద్యార్థులకు ఆంగ్లంలో అత్యుత్తమ బోధన అందించాలని, వారిని గొప్పగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఇక్కడ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సదానందం(కోర్సు కో-ఆర్డినేటర్), మెంటార్లు ప్రవీణ్‌కుమార్, పవన్‌కుమార్, శేఖర్, సీఆర్పీలు రవి, సురేశ్, పరమేశ్వర్, గుర్రప్పా, 41మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
హుజూరాబాద్‌లో..
ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనపై హుజూరాబాద్, సైదాపూర్, వీణవంక, శంకరపట్నం మండలాల ప్రభుత్వ ఉపాధ్యాయులకు సోమవారం హుజూరాబాద్‌లోని రెండు సెంటర్లలో శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు కొనసాగనున్న శిక్షణలో ఆంగ్లమాధ్యమంలో బోధనకు సంబంధించి మెళకువలు, తదితర అంశాలపై డిజిటల్ విధానంలో శిక్షణ ఇచ్చారు. కోర్సు డైరెక్టర్ ఎంఈవో కొమ్మెర శ్రీనివాస్‌రెడ్డి, కో ఆర్డినేటర్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు వూరుగొండ సత్యప్రసాద్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించగా డిస్ట్రిక్ట్ లెవల్ మెంటర్స్గా కందుకూరి శ్రీనివాస్, రంగు వేణుగోపాలాచారి, శ్రీనివాసరెడ్డి, శివకుమార్, కొండల్‌రెడ్డి, వినోద్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీలు రంగు దామోదరాచారి, రవిబాబు, చక్రపాణి, బీస రమేశ్, మధు, సుమారు 90 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.