రమణీయం డోలోత్సవం
ధర్మపురిలో వైభవంగా నర్సన్న బ్రహ్మోత్సవాలు
పాల్గొన్న మంత్రి ఈశ్వర్
ధర్మపురి, మార్చి 18: ధర్మపురి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి(యోగ)వారి తెప్పోత్సవం, డోలోత్సవ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. తెప్పోత్సవం సందర్భంగా బ్రహ్మపుష్కరిణి (కోనేరు)కి రంగులు వేసి, విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. ఆలయం నుంచి స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను మేళతాళాలు, భక్తుల గోవిందనామస్మరణ మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి కోనేరులో అందంగా అలంకరించిన హంసవాహనంలో ఐదు ప్రదక్షిణలు చేయించారు. ప్రదక్షిణాల్లో మంత్రి ఈశ్వర్ పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి స్వామి వారి సేవ మోశారు. భక్తులు అధికసంఖ్యలో వచ్చి తెప్పోత్సవాన్ని తిలకించారు. అనంతరం డోలోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమం రాత్రి 9గంటల వరకూ కొనసాగగా… భక్తులు క్యూలైన్లో స్వామివార్లను దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శేషప్ప కళావేదికపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
క్షేత్ర అభివృద్ధిపై దృష్టి: మంత్రి కొప్పుల
ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. ధర్మపురి క్షేత్ర అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. 2003 పుష్కరాల సమయంలోనే తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ధర్మపురి క్షేత్రంలో హోమం నిర్వహించిననాడే అభివృద్ధికి శ్రీకా రం చుట్టినట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ టెంపుల్ సిటీ అభివృద్ధికి ఇప్పటికే రూ.110కోట్లు ప్రకటించారన్నారు. దాదాపు రూ.45కోట్లతో అభివృద్ధి పనులు ప్రగతిలో ఉన్నాయన్నారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండడంతో పాటు రాష్ట్ర రథసారథి, సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని లక్ష్మీనర్సింహస్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి వారి కృప ప్రతీ భక్తునిపై ఉంటుందన్నారు.