12 చెక్‌డ్యాంలతో మూలవాగును సజీవనదిగా మార్చాలి
మధ్యమానేరు నిర్వాసిత గ్రామాల్లో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
వేములవాడ మున్సిపల్ పరిధిలో మౌలిక వసతులకు అంచనాలు రూపొందించాలి
కలికోట-సూరమ్మ ఎత్తిపోతలకు త్వరలోనే 650 కోట్ల నిధులు
అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశం
వేములవాడ నియోజకవర్గ అభివృద్ధిపై హైదరాబాద్‌లో సమీక్ష
ఎమ్మెల్యే చెన్నమనేని హాజరు
వేములవాడ, మార్చి 15: వేములవాడ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులతోపాటు నూతన బడ్జెట్ కేటాయించిన నిధులతో చేపట్టనున్న పనులను వేగవంతం చేయాలని అధికారులను రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అదేశించారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ కమిటీ హాల్లో మంగళవారం ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో కలిసి రాష్ట్ర స్థాయి అధికారులతో వేములవాడ నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రధానంగా మిగిలిన ఎల్లంపల్లి ఎత్తిపోతల పనులకు 40 కోట్ల నిధులు మంజూరు చేశామని, ఆ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మూలవాగును సజీవ నదిగా మార్చడంతోపాటు పరీవాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పెంపునకు 60కోట్లతో నిర్మిస్తున్న 12 చెక్‌డ్యాం పనులు జూన్ వరకు పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ మురళీధర్ రావును ఆదేశించారు.
మేడిపల్లి, కథలాపూర్ రైతులకు సాగునీరందించే సూరమ్మ-కలికోట ఎత్తిపోతల నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ త్వరలోనే 650 కోట్ల నిధులు ప్రకటిస్తారని చెప్పారు. మోత్కురావుపేట-చందుర్తి రహదారి పనులను వేగవంతం చేయాలని సూచించారు. మర్రిమడ్ల-మానాల రహదారి నిర్మాణ పనులకు 8.50కోట్ల నిధులు మంజూరయ్యాయని, సమన్వయంతో అటవీ అనుమతులు పొంది టెండరు ప్రక్రియను పూర్తి చేయాలని రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ రవీందర్ రావును ఆదేశించారు. నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన తండా పంచాయతీల భవనాలకు 25లక్షలు మంజూరు చేశామన్నారు. మండల పరిషత్ భవనాలు, మండలాల్లో అవసరమైన రహదారుల నిర్మాణాలు, మరమ్మతు పనులకు అంచనాలు తయారు చేసి అందజేస్తే నిధులు విడుదల చేస్తామన్నారు. మధ్యమానేరులో ముంపునకు గురైన గ్రామాల్లో పెండింగ్ సమస్యలు, పరిహారం, రుద్రవరంలో సబ్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిని మంత్రి ఆదేశించారు.
ఇక జిల్లా సరిహద్దు నుంచి నంది కమాన్ వరకు 35కోట్లతో చేపడుతున్న నాలుగు వరు సల రహదారి పనులు వేగవంతం చేయాలన్నారు. గుడిచెరువు ట్యాంక్‌బండ్‌లో మిగిలిన భూసేకరణకు 20కోట్ల నిధులు కేటాయించామన్నారు. పట్టణంలో రహదారుల విస్తరణ, గుడిచెరువులో సుందరీకరణ, ఘాట్ల నిర్మాణాలు, మూలవాగుపై రెండో వంతెన పనుల్లో వేగం పెంచాలన్నారు. సినారె కళాభవనం కొత్తగా నిర్మించేందుకు 7కోట్లు, స్టేడియం పనులకు 5కోట్లు మంజూరు చేస్తామన్నారు.
వేములవాడ పురపాలక సంఘం పరిధిలో కనీస మౌలిక వసతులైన సీసీ రహదారులు, మురుగు కాలువలు, ఆధునిక ధోబీఘాట్ల నిర్మాణాలు, కూడళ్ల సుందరీకరణకు సంబంధించిన వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనాలు అందజేయాలని మున్సిపల్ సీడీఎంఏ సత్యనారాయణకు సూచించారు. వేములవాడ పట్టణంతోపాటు విలీన గ్రామాల్లో మిషన్ భగీరథ పనులు వెంటనే పూర్తి చేసి నీటిని అందించాలని ప్రజారోగ్య ఈఎన్సీ శ్రీధర్‌ను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో వీటీడీఏ వైస్ చైర్మన్ ముద్దసాని పురుషోత్తం రెడ్డి, ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ రావు, ఎల్లంపల్లి సీఈ సుధాకర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీ రవీందర్ రావు, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, కమిషనర్ శ్యామ్‌సుందర్ రావు తదితరులు పాల్గొన్నారు.